BIG TV Originals: ఇతర ప్రయాణాలతో పోల్చితే రైలు ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే చాలా మంది రైల్లో వెళ్లేందుకు ఇష్టపడుతారు. ట్రైన్ జర్నీ చేయాలంటే టికెట్ తప్పకుండా తీసుకోవాల్సిందే. కానీ, కొన్ని దేశాలు ఉచితంగా రైల్లో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నాయి. రైలు ప్రయాణం పర్యావరణ అనుకూలమైనది కావడంతో తమ పౌరులకు ఈ సదుపాయాన్ని పరిచయం చేసింది. రద్దీని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ప్రజా రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. నిజానికి అందరికీ పూర్తి ఉచిత రైలు ప్రయాణం అందించే దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. లక్సెంబర్గ్, ఎస్టోనియాతో పాటు కొన్ని దేశాలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఉచిత రైలు ప్రయాణాన్ని అందించే దేశాలు
⦿ లక్సెంబర్గ్: ప్రపంచంలో అందరికీ ఉచిత ప్రయాణం అందించే తొలి దేశంగా లక్సెంబర్గ్ గుర్తింపు తెచ్చుకుంది. 2020లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందరికీ రైళ్లు, బస్సుల ద్వారా ఉచిత ప్రజా రవాణా అందించడం మొదలుపెట్టింది. ఈ విధానం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గించాలని నిర్ణయించింది. లక్సెంబర్గ్ లో రైళ్లలో ఫస్ట్ క్లాస్ మినహా మిగతా వాళ్లంతా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ చిన్న దేశం, తక్కువ జనాభా కలిగి ఉండటం వల్ల ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయగలిగింది. ఈ సౌకర్యం పర్యాటకులకు కాకుండా, స్థానిక ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
⦿ ఎస్టోనియా: 2018 నుంచి ఎస్టోనియా కూడా తమ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉచిత ప్రజా రవాణాను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా కొన్ని రైళ్లలో ఉచిత ప్రయాణం అమలు చేసింది. టాలిన్ నగరంలో 2013 నుంచి ఉంటున్న నివాసితులకు ఉచిత రవాణా అందుబాటులో ఉంది. ఈ ప్రయాణం ప్రభుత్వం అందించే స్మార్ట్ కార్డ్ ఉన్న నివాసితులకు మాత్రమే. జాతీయ స్థాయిలో రైళ్లు పూర్తిగా ఉచితం కాదు. ఇంటర్ సిటీ రైళ్లకు కూడా టికెట్ తీసుకోవాల్సిందే. 2024 నాటికి ఎస్టోనియాలో 19 ఏళ్ల లోపు, 63 ఏళ్ల పైబడిన వారికి ఉచిత రవాణా సౌకర్యాలు అందబాటులోకి వచ్చాయి.
⦿ మరికొన్ని దేశాల్లోనూ: మరికొన్ని దేశాల్లో పూర్తి అందరికీ ఉచిత ప్రయాణం కాకపోయినా, కొంత మందికి ఉచిత రైలు ప్రయాణం అందిస్తున్నారు. స్కాట్లాండ్ లో 22 ఏళ్ల లోపు వారికి, వికలాంగులకు రైళ్లలో ఉచిత ప్రయాణం అమలు అవుతోంది. రొమేనియాలో విద్యార్థులు ఇంటర్ సిటీ రైళ్లలో ఉచిత ప్రయాణం చేయవచ్చు. యూనివర్సిటీ విద్యార్థులకు 50% రాయితీ అందిస్తుంది. నెదర్లాండ్స్ లో విద్యార్థులు దేశ వ్యాప్తంగా రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేవచ్చు. హంగరీలో 14 ఏళ్ల లోపు, 65 ఏళ్ల పైబడిన వారికి ఉచిత రైలు ప్రయాణం అందుబాటులో ఉంది.
⦿ అధిక జనాభా ఉన్న దేశాల్లో సాధ్యమేనా?
దేశవ్యాప్తంగా అందరికీ ఉచిత రైలు ప్రయాణం అందించే ఏకైక దేశం లక్సెంబర్గ్ మాత్రమే. ఇతర దేశాలు కొన్ని వయసులు, కొన్ని ప్రాంతాల వారికి మాత్రమే ఉచిత రైలు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ విధానాలు ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడంలో, కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పెద్ద జనాభా ఉన్న దేశాల్లో ఈ విధానాన్ని అమలు చేయడం ఆర్థికంగా పెను సవాలుగా మారే అవకాశం ఉంటుంది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA ద్వారా కంప్లైట్ ఫైల్ చేయబడుతుంది.
Read Also: ప్రపంచంలో పాస్ పోర్ట్ ఉన్న ఏకైక మమ్మీ, 3000 ఏళ్ల రామ్సెస్ 2 గురించి మీకు తెలుసా?