AP Cabinet : మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తిరుమల గోశాల ఎపిసోడ్‌లో వైసీపీ అసత్యప్రచారాన్ని తిప్పికొట్టడంలో మంత్రులు వైఫల్యం చెందారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలం అవుతున్నారని అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా మంత్రుల తీరులో మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత కార్యదర్శులు, OSDల తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయని.. వాటిని సరిచేసుకోవాలని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు.
ఫేక్ ప్రచారంపై చంద్రబాబు సీరియస్
ఏపీ కేబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనలో అసహనం కొట్టొచ్చినట్టు కనిపించిందని అంటున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లు వైసీపీపై, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంపై ఎప్పటికప్పుడూ గట్టిగానే స్పందిస్తున్నారు. కానీ, మంత్రుల నుంచి రావాల్సిన మేరకు స్ట్రాంగ్ రియాక్షన్ రావట్లేదనేది సీఎం అసంతృప్తి. తిరుమల గోశాల ఎపిసోడే తీసుకుంటే.. భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలు వేగంగా ప్రజల్లోకి వెళ్లాయి. అవన్నీ అబద్దమని ఖండించేలోగా అబద్దం ఏపీని చుట్టేసింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావులే ప్రెస్ మీట్‌లు పెట్టి ఆ ఆరోపణలను ఖండించాల్సి వచ్చింది. అదేదో కేవలం టీటీడీకే చెందిన వ్యవహారం అనుకుని.. మంత్రులెవరూ ఆ విషయంపై స్పందించకుండా మిన్నకుండిపోయారు. అదే చేటు చేసింది. ఇటు నుంచి గట్టి కౌంటర్లు పడకపోవడం.. అసలు నిజాలు ఏంటనే వాదన బలంగా వినిపించకపోవడంతో.. ఏదో జరిగే ఉంటుంది.. ఆవులు చనిపోయే ఉంటాయనే ప్రచారాన్ని కొందరు నమ్మాల్సి వచ్చింది.
ఎదురుదాడి చేయాల్సిందే..
ఫేక్ ప్రచారం చేసిన భూమనపై కేసు పెట్టినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని అంటున్నారు. పాస్టర్ ప్రవీణ్ ఎపిసోడ్‌లోనూ ఇలానే జరిగింది. ప్రవీణ్‌ను చంపేశారంటూ మత విధ్వేషాలు రగిల్చే ప్రయత్నం చేశారు. అప్పుడూ ఎదురుదాడి చేయలేక పోయారు. ఇదంతా మంత్రుల వైఫల్యమేననేది చంద్రబాబు ఆగ్రహానికి కారణం. ఇక, మంత్రులే ఇలా ఉంటే.. ఎమ్మెల్యేల సంగతి వేరే చెప్పాలా? వాళ్లు మరీ అడ్రస్ లేకుండా పోతున్నారనేది టీడీపీ పెద్దల ఆరోపణ.
Also Read : అటు వక్ఫ్.. ఇటు టీటీడీ.. వైసీపీకి కలిసొచ్చేదేంటి?
కేబినెట్ డెసిషన్స్ ఇవే..
ఏపీ కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మంత్రిమండలిలో చర్చ జరిగింది. వచ్చే అకాడెమిక్ ఇయర్ కల్లా టీచర్ పోస్టుల భర్తీ పూర్తి చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. కొత్త అసెంబ్లీ నిర్మాణానికి 617 కోట్లు.. హైకోర్టు భవన నిర్మాణాలకు 786 కోట్లు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖలో టీసీఎస్‌కు 21.66 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 30 మెగావాట్లతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఓకే చెప్పారు. ఏపీ వ్యాప్తంగా కొత్త రోడ్ల నిర్మాణం, రహదారుల మరమ్మత్తు చేయాలని కేబినెట్ నిశ్చయించింది. రాజధానిలో టెండర్లు పిలిచి పనులు మొదలు పెడుతున్నట్టు.. డ్రైన్స్, పవర్ లైన్స్ వంటి పనులు కొనసాగించాలని నిర్ణయించారు. ఈఎస్ఐ ఆస్పత్రికి గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించారు. కుప్పంలో కేంద్రీయ విద్యాలయం, పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, విజయనగరం గ్రే హౌండ్స్ కి ఉచితంగా భూమి ఇవ్వాలని డిసైడ్ చేశారు.