Big Tv Originals: ప్రపంచంలో అత్యంత గొప్ప చరిత్ర కలిగిన దేశం ఈజిప్ట్.శతాబ్దాల తరబడి ఇక్కడ రాచరిక పాలన కొనసాగింది. నాగరికత విరాజిల్లిన దేశాల్లో ఈజిప్ట్ ఒకటి. సాధారణంగా ఈజిప్ట్ అనగానే ప్రపంచ వింతల్లో ఒకటైన పిరమిడ్స్ గుర్తుకు వస్తాయి. చక్రవర్తులు, రాజ కటుంబీకుల సమాధులను ఇలా నిర్మించారు. ఈజిప్ట్ మమ్మీల గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇక్కడి మమ్మీల గురించి ఎన్నో కథలు వినిపిస్తాయి. ఇప్పుడు మనం ఓ అసాధారణ మమ్మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రపంచంలో పాస్ పోర్టు కలిగిన ఏకైక మమ్మీ
మమ్మీలు ప్రాణం లేని వందల వేల ఏళ్ల నాటి శవాలు. ఆయా మ్యూజియాలలో వాటిని పదర్శిస్తున్నారు. కానీ, ప్రపంచ చరిత్రలో ఓ మమ్మీకి అరుదైన గుర్తింపు లభించింది. ఏకంగా సదరు మమ్మీకి చట్ట ప్రకారం పాస్ పోర్టు జారీ చేయబడింది. 3,000 ఏళ్ల క్రితం మరణించిన ఈజిప్టు ఫారో రామ్సెస్ II మమ్మీకి.. 1974లో అఫీషియల్ గా పాస్ పోర్ట్ ను అందించారు. ఈ వింత సంఘటన ఈజిప్టు, ఫ్రాన్స్ పాస్ పోర్టు చట్టాల ప్రకారం జారీ చేయబడింది.
రామ్సెస్ II మమ్మీ గురించి..
రామ్సెస్ II ఈజిప్టు చరిత్రలో అత్యంత శక్తివంతమైన ఫారోలలో ఒకరిగా పరిగణించబడతారు. ఆయన 60 ఏళ్లకు పైగా ఈజిప్టును పరిపాలించారు. క్రీ.పూ. 1279 నుంచి 1213 వరకు ఆయన పాలన కొనసాగించింది. 90 ఏళ్లకు పైగా జీవించారు. వందలాది సంతానానికి జన్మనిచ్చారని చరిత్ర చెప్తోంది. 1881లో డీర్ ఎల్ బాహ్రీలోని రహస్య రాజ స్థలంలో ఆయన మమ్మీని పరిశోధకులు గుర్తించారు. అక్కడ 50 మందికి పైగా ఇతర రాజులు, ప్రముఖుల మమ్మీలను కనుగొన్నారు.
రామ్సెస్ మమ్మీకి పాస్ పోర్టు ఎందుకు జారీ చేశారంటే?
1974లో రామ్సెస్ II మమ్మీ కుళ్లిపోతున్నట్లు ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇలా జరుగుతున్నట్లు గుర్తించారు. దీనిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించారు. దీనికి చికిత్స అందించేందుకు ఫ్రాన్స్ కు తరలించాలని భావించారు. ఈజిప్టు చట్టం ప్రకారం, బతికి ఉన్నవాళ్లు అయినా, మృతదేహాలు అయినా, ఇతర దేశాలకు తీసుకెళ్లాలంటే పాస్ పోర్ట్ తప్పనిసరి. ఈ నిబంధన కారణంగానే రామ్సెస్ II మమ్మీకి అధికారికంగా పాస్ పోర్ట్ జారీ చేశారు. చరిత్రలో ఒక మమ్మీకి పాస్ పోర్ట్ జారీ చేయడం ఇదే తొలిసారి, చివరిసారి.
రాజగౌరవంతో మమ్మీకి స్వాగతం
ఇక ఈ పాస్ పోర్టులో రామ్సెస్ II ఫోటోగా ఆయన మమ్మీ ముఖాన్ని తీసుకున్నారు. ఆయన వృత్తిని మరణించిన రాజుగా పేర్కొన్నారు. 1976లో, మమ్మీని చికిత్స కోసం పారిస్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు రాజుకు సమానమైన సైనిక గౌరవాలతో స్వాగతం లభించింది. పారిస్ ఎథ్నోలాజికల్ మ్యూజియంలో నిపుణులు మమ్మీని పరీక్షించి, ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు చికిత్స చేసి, దానిని చెడిపోకుండా తగిన చర్యలు తీసుకున్నారు. పరీక్షల సమయంలో రామ్సెస్ II గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ఎత్తు సుమారు 5 అడుగుల 7 అంగుళాలుగా ఉన్నట్లు గుర్తించారు. ఎరుపు జుట్టు కలిగి ఉన్నారు. ఆయన ఆర్థరైటిస్, దంత సమస్యలతో బాధపడ్డారని కనుగొన్నారు. చికిత్స తర్వాత, మమ్మీ సురక్షితంగా కైరోలోని ఈజిప్టు మ్యూజియంకు తరలించారు. అక్కడ ఈ మమ్మీ ఇప్పటికీ ప్రదర్శించబడుతోంది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA ద్వారా కంప్లైట్ ఫైల్ చేయబడుతుంది.
Read Also: కోపంతో ఊగిపోతున్నారా? రెండు నిమిషాల్లో మీ శరీరంలో ఏర్పడే ప్రమాదకర చర్యలివే!