Indian Railway News: రైళ్లు రివర్స్ వెళ్లడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. తప్పదు అనుకున్న పరిస్థితులలోనే వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. తాజాగా మహారాష్ట్రలో ఓ రైలు ఏకంగా 700 మీటర్లు రివర్స్ లో వెనక్కి వెళ్లింది. రైల్లో నుంచి పడిపోయిన ఓ ప్రయాణీకుడి ప్రాణాలను కాపాడేందుకు లోకో పైలెట్ రైలును వెనక్కి తీసుకెళ్లాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రైల్లో నుంచి పడిపోయిన ప్రయాణీకుడు
ముంబై- నాందేడ్ మధ్య నడిచే తపోవన్ ఎక్స్ ప్రెస్ మన్మాడ్ జంక్షన్ సమీపంలోకి రాగానే, ఓ ప్రయాణీకుడు ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడ్డాడు. ఈ విషయాన్ని బోగీలోని తోటి ప్రయాణీకులు గమనించారు. వెంటనే రైల్లోని ఎమర్జెన్సీ చైన్ లాగారు. రైలు ఆగిపోయింది. ట్రైన్ గార్డు ఎందుకు ఎమర్జెన్సీ చైన్ లాగారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అతడికి అసలు విషయం చెప్పారు తోటి ప్రయాణీకులు. వెంటనే ఈ విషయాన్ని రైలు గార్డు, లోకో పైలెట్ కు చెప్పాడు. లోకో పైలెట్ ఎలాగైనా సదరు ప్రయాణీకుడిని కాపాడాలి అనుకున్నారు. ఈ విషయాన్ని కంట్రోలర్ కు చెప్పాడు. రైలు వెనక్కి నడిపేందుకు అతడి నుంచి అనుమతి తీసుకున్నాడు. గాయపడిన వ్యక్తిని రైల్లోకి ఎక్కించుకునేందుకు సుమారు 700 మీటర్లు వెనక్కి నడిపించాడు.
తీవ్ర గాయాలతో ట్రాక్ పక్కన పడిపోయిన ప్రయాణీకుడు
రైలు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకునేటప్పడికి ప్రయాణీకుడు పట్టాల పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. అతడిని ఉత్తర ప్రదేశ్ కు చెందిన 30 ఏండ్ల సర్వర్ షేక్ గా గుర్తించారు. వెంటనే తోటి ప్రయాణీకుల సాయంతో అతడిని రైల్లోకి ఎక్కించుకున్నారు. వెంటనే రైలును మన్మాడ్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అప్పటికే రైల్వే అధికారులు, అంబులెన్స్ తో సహా మెడికల్ సిబ్బందితో ఎదురు చూస్తున్నారు. వెంటనే సర్వర్ షేక్ ను అంబులెన్స్ లో ఎక్కించి హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత రైలు మన్మాడ్ స్టేషన్ నుంచి నాందేడ్ కు బయల్దేరి వెళ్లింది. అటు తపోవన్ ఎక్స్ ప్రెస్ వెనుక వస్తున్న గూడ్స్ రైలును మన్మాడ్ కు ముందు స్టేషన్ లోనే ఆపారు. తపోవన్ ఎక్స్ ప్రెస్ రైలు మన్మాడ్ స్టేషన్ కు చేరుకున్న తర్వాత గూడ్స్ రైలును ముందుకు కదిలేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు.
హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయిన ప్రయాణీకుడు
ఇంతక కష్టపడి గాయాపడిన ప్రయాణీకుడు సర్వర్ షే ను హాస్పిటల్ కు తరలించినప్పటికీ, ఆయన కోలుకోలేకపోయాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. రైల్లో నుంచి కింద పడిన సమయంలో అతడి తల, మెడకు బలమైన గాయాలు కావడంతో డాకర్లు తమ ప్రయత్నం చేసినప్పటికీ కాపాడాలేకపోయారు. ఈ ఘటన శనివారం(జనవరి 4)నాడు జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఓ ప్రయాణీకుడి ప్రాణాలు కాపాడేందుకు లోకో పైలెట్ సహా, ఇతర రైల్వే సిబ్బంది చేసిన ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.
Read Also:స్టేషన్ కు వెళ్లకుండానే జనరల్ టికెట్ బుకింగ్, సింఫుల్ గా ఈ యాప్ లో ట్రై చేయండి!