Prashant Kishor Arrest Bihar | ప్రముఖ పొలిటికల్ స్ట్రాటిజిస్ట్, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ని పట్నా పోలీసులు సోమవారం జనవరి 6, 2025న అరెస్టు చేశారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్‌సి) పరీక్షని రద్దు చేయాలని నిరసన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా పట్నా నగరంలోని గాంధీ మైదాన్ లో ఆయన జనవరి 2, 2025 నుంచి నిరాహార దీక్ష చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డిసెంబర్ 13, 2024న జరిగిన బిపిఎస్‌సి పరీక్ష పేపర్ లీక్ అయిందని.. ఆ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు బిహార్ రాష్ట్రంలో నిరసనలు చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం పేపర్ లీక్ కాలేదని.. కేవలం ఒక్క పరీక్షా కేంద్రంలోనే లీక్ అయిందని చెబుతూ ఆ ఒక్క కేంద్రంలోనే మళ్లీ పరీక్ష నిర్వహిస్తామన్నారు. దీంతో విద్యార్థుల నిరసనలు తీవ్రమయ్యాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్, జన్ సురాజ్ పార్టీ నాయకులు రంగంలోకి దిగారు. కానీ గాంధీ మైదాన్ లో నిరసన చేయడంపై నిషేధం విధించినా.. ఆ ప్రదేశంలోనే నిరసన చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ అంశంపై పట్నా సీనియర్ సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవకాశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. “ప్రశాంత్ కిషోర్, ఇతరులపై నిషేధిత ప్రాంతంలో నిరసనలు చేస్తున్నందుకు అరెస్టు చేశాం. వారిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశాం. కానీ అరెస్టు తరువాత కూడా ప్రశాంత్ కిషోర్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. వైద్య చికిత్స అందిస్తున్నా సహకరించడం లేదు. తాను ఆమరణ నిరాహార దీక్ష అని చెబుతున్నారు.” అని తెలిపారు.
Also Read: ప్రియాంక గాంధీ, సిఎం ఆతిషిలపై బిజేపీ నాయకుడి అసభ్యకర వ్యాఖ్యలు.. వేడెక్కిన ఢిల్లీ రాజకీయాలు
గత కొన్ని వారాలుగా బిహార్ లో పరీక్ష రద్దు కోసం విద్యార్థులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. విద్యార్థుల నిరసనకు మద్దతు ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను విద్యార్థుల సమస్యలు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో గాంధీ మైదాన్ నుంచి నిరాహార దీక్ష చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ని, ఇతర నిరసనకారులను పోలీసులు బలవంతంగా తీసుకెళుతున్నట్లు కనిపిస్తోంది.
గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రశాంత్ కిషోర్ బిపిఎస్‌సి పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జన్ సురాజ్ పార్టీ తరపున ఆయన పట్నా హై కోర్టులో పరీక్షా పేపర్ లీక్ పై విచారణ కోసం పిటీషన్ వేయనున్నట్లు తెలిపారు.
వ్యానిటీ వ్యాన్ వివాదం
ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష చేస్తున్న ప్రాంతంలో ఆయనకు చెందిన ఒక వ్యానిటి వ్యాన్ ఉంది. దాంతో ఇతర పార్టీల నాయకులు ఆయన దీక్ష అంతా ఫేక్ అని ఆరోపించారు. దీనికి సమాధానంగా ప్రశాంత్ కిషోన్ మీడియాతో మాట్లాడుతూ.. “తాను కాలకృత్యాలకు ఇంటికి వెళితే అందరూ ఇంట్లో తిని వస్తున్నాడని ఆరోపణలు చేయకుండా ఉండేందుకు నిరసన చేపట్టిన ప్రాంతంలోనే బాత్రూం కోసం వ్యానిటీ వ్యాన్ ఉపయోగిస్తున్నాను.” అని అన్నారు.