Monolithic Slab Temple: ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా ఫలకంతో చెక్కిన ఆలయం ఇండియాలోనే ఉంది. మహారాష్ట్రలో(Maharastra) ఉన్న ఎల్లోరా గుహలలో ఉండే కైలాస ఆలయం పురాతన భారతీయ నిర్మాణ చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. దీన్ని 8వ శతాబ్దంలో నిర్మించి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొండపై నుండి ఆలయాన్ని చెక్కి ఉంటారని చెబుతున్నారు. ఆలయాన్ని నిర్మించేందుకు సుమారు 2 లక్షల టన్నుల రాతిని తవ్వి ఉంటారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు.
ద్రావిడ, దక్కన్ నిర్మాణ శైలిని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలోని గోడలపై దేవతల శిల్పాలు, పౌరాణిక దృశ్యాలు కనిపిస్తాయి. కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించిన రావణుడి పౌరాణిక కథను తెలిపేలా ఉన్న శిల్పాలను కూడా ఇక్కడ అందంగా చెక్కారు. 8వ శతాబ్దంలోనే ఆలయాన్ని అంత అందంగా తీర్చిదిద్దారంటే.. ఏక శిలా ఫలకాన్ని చెక్కడానికి ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఆలయం లోపల శివలింగం ఉంటుంది. దాని ముందే నంది మండపం కూడా కనిపిస్తుంది.
ALSO READ: అనంతగిరి అందాలు చూసొద్దామా..?
కైలాస ఆలయం ఒక నిర్మాణ అద్భుతం మాత్రమే కాదు, సాంస్కృతిక కేంద్రం కూడా. మహా శివరాత్రి, ఎల్లోరా ఉత్సవంతో సహా ఏడాది పొడవునా వివిధ ఉత్సవాలను ఇక్కడ ఘనంగా జరుపుతారట. అందుకే ఈ ఆలయానికి భక్తులు, పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అజంతా గుహలు, దౌలతాబాద్ కోట వంటి ఇతర చారిత్రక ప్రదేశాలకు ఆలయం సమీపంలోనే ఉన్నాయి. అందుకే ఈ ఆలయానికి మరింత ఆదరణ వచ్చింది.
ఎప్పుడు వెళ్లాలంటే..?
ఈ కైలాస ఆలయం కేవలం గుడి మాత్రమే కాదు. పురాతన ఇంజనీరింగ్, కొండను కూడా చెక్కి అందమైన కళారూపంగా మార్చిన అనేక మంది శిల్పుల ప్రతిభకు ప్రతిభింభం. ఇది భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చూపిస్తుంది.
ఈ టెంపుల్‌కి వెళ్లాలనకునే వారు ముందుగా ముంబై చేరుకొని అక్కడి నుండి ఎల్లోరా గుహలకు వెళ్లాలి. అక్కడి నుంచి కాలి నడకన కూడా ఆలయానికి చేరుకోవచ్చు. గుడి లోపలికి వెళ్లేందుకు ఇండియన్స్‌కి అయితే రూ.40, విదేశీయులకు రూ.600 ఎంట్రీ ఫీజ్ ఉంటుంది. అక్టోబర్, మార్చి మధ్య ఈ ఆలయాన్ని సందర్శించేందుకు చాలా సౌకర్యంగా ఉంటుంది. అయితే ఈ ఆలయం ప్రతి మంగళవారం మూసే ఉంటుందట. ఆ రోజు తప్ప ఇతర సమయాల్లో ఎప్పుడైనా ఆలయం లోపలికి వెళ్లొచ్చు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.