TTD Goshala : అంతన్నారు.. ఇంతన్నారు.. గోశాలలో వందలాది గోవులు చనిపోతున్నాయన్నారు.. పాత ఫోటోలను కొత్తగా వైరల్ చేశారు.. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి గోవుల పాలిటిక్స్‌కు తెరలేపారు. వెంటనే టీటీడీ అలర్ట్ అయింది. గోవులు చనిపోలేదని క్లారిటీ ఇచ్చింది. భూమనపై కేసు కూడా పెట్టింది. టీడీపీ సైతం రంగంలోకి దిగింది. గురువారం, ఉదయం 10 గంటలకు గోశాలకు రా.. లైవ్‌లో చూస్కుందాం అంటూ భూమనకు టీడీపీ సవాల్ చేసింది. కరుణాకర్‌రెడ్డి సైతం అందుకు సై అన్నారు. ఇక ఆ ముహుర్తం రానే వచ్చింది. తిరుపతిలో రచ్చ రచ్చ జరిగింది. గోశాల గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఉదయం నుంచే హైటెన్షన్
తిరుమల గోశాల చుట్టూ ఏపీ రాజకీయం వేడెక్కింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో పంంతం నీదా నాదా సై అన్నట్టు సాగుతోంది. సవాళ్లలో భాగంగా గురువారం ఉదయానికల్లా గోశాల దగ్గరకు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు చేరుకున్నారు. భూమన కరుణాకర్‌రెడ్డి కోసం వెయిటింగ్ అంటూ రెడీగా ఉన్నారు.
రోడ్డుపై భూమన నిరసన
అటు, గోశాలకు వెళ్లేందుకు మందీమార్బలంతో సిద్ధమయ్యారు భూమన కరుణాకర్‌రెడ్డి. ఎంపీ గురుమూర్తితో కలిసి ర్యాలీగా బయల్దేరిన భూమనను పోలీసులు అడ్డుకున్నారు. నేతలు, కార్యకర్తలతో వెళ్లి శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని కోరారు. గన్‌మెన్లను తీసుకొని సింగిల్‌గానే వెళ్లాలని కరుణాకర్‌రెడ్డికి పోలీసులు సూచించారు. ఆ సమయంలో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా నడిరోడ్డుపై పడుకుని భూమన కరుణాకర్‌రెడ్డి నిరసన తెలిపారు. భూమనకు మద్దతుగా మాజీ మంత్రి రోజా, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అక్కడకు చేరుకోవడంతో హైటెన్షన్ హైటెన్ష్ వాతావరణం నెలకొంది.
ఎంపీ గురుమూర్తి ఒక్కరే వచ్చి..
అదే సమయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భద్రత కల్పిస్తాం గోశాలకు రావాలంటూ.. భూమనకు టీడీపీ ఎమ్మెల్యేలు పులివర్తి, బొజ్జల ఫోన్ చేశారు. ఎస్కార్ట్ కల్పిస్తే వస్తానని భూమన చెప్పారు. కట్ చేస్తే.. 10 నిమిషాల తర్వాత గోశాల దగ్గరికి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఒక్కరే వచ్చారు. భూమనను పోలీసులు రానివ్వడం లేదని.. తానే గోడ దూకి వచ్చానన్న ఎంపీ గురుమూర్తి అన్నారు. కారులో వస్తే గోడ దూకి ఎలా వస్తావంటూ.. గురుమూర్తిని కూటమి ఎమ్మెల్యేలు నిలదీశారు. కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, గురుమూర్తి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. కూటమి ఎమ్మెల్యేలు గట్టిగా ప్రశ్నించడంతో కాసేపటికే వైసీపీ ఎంపీ గురుమూర్తి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మధ్యాహ్నం తర్వాత కూడా రచ్చ కంటిన్యూ అయింది.
గురుమూర్తిలానే భూమన రావొచ్చుగా?
అడ్డుకున్నారనే సాకుతో భూమన కరుణాకర్‌రెడ్డి గోశాల గొడవ నుంచి పారిపోయారని టీడీపీ విమర్శిస్తోంది. ఎంపీ గురుమూర్తి వచ్చినట్టే.. భూమన కూడా రావొచ్చుగా అని ప్రశ్నిస్తోంది. ఆవులు చనిపోయాయని దుష్ప్రచారం చేసి.. తీరా గోశాలకు రమ్మనే సరికి పొలిటికల్ ట్రిక్కులతో తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు.
భూమన మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి..
కట్ చేస్తే.. భూమన కరుణాకర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో ప్రత్యక్షమయ్యారు. తాను గోశాలకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. ఐదుగురికి పర్మిషన్ ఇస్తే తాను ఇప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. తనకు సవాల్ విసిరిన టీడీపీ స్టేట్ చీఫ్ తోకముడిచారని భూమన విమర్శించారు.
హోంమంత్రి అనిత రియాక్షన్..
మరోవైపు, తిరుపతి ఘటనలో ఎవరినీ నిర్బంధించలేదని హోంమంత్రి అనిత తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎవరినీ హౌజ్ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వచ్చినా.. టీడీపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేసేవారని.. ఇంటి దగ్గర పోలీసులను పెట్టేవారని గుర్తు చేశారు.