Kashmir Tour Cancels: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కారణంగా కాశ్మీర్‌లో పర్యాటక రంగం తీవ్రంగా ప్రభావితమైంది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది హిందూ పర్యాటకులే. ఉగ్ర దాడి అనంతరం వివిధ ప్రాంతాల నుండి కాశ్మీర్ కు వచ్చే పర్యాటకులు భద్రతా భయాల కారణంగా తమ బుకింగ్స్‌ను రద్దు చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. పహల్గామ్ సహా కాశ్మీర్‌లోని ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న పర్యాటక కేంద్రాలలో 48 ప్రదేశాలు, అనేక రిసార్టులు మూసివేయబడ్డాయి. ఇది పర్యాటకులలో ఆందోళనలను మరింత పెంచింది .
కాశ్మీర్ పర్యటనను లక్షలాది మంది రద్దు చేసుకున్నారు. కేవలం గుల్మర్గ్, పహల్గామ్, ధాల్ సరస్సు వంటి ప్రదేశాల్లోనే కాదు.. మొత్తం కాశ్మీర్ వ్యాప్తంగా ఏ టూరిస్ట్ ప్రాంతానికి రావడానికైనా పర్యాటకులు ఆసక్తితో లేరు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, ఈజ్‌మైట్రిప్ వంటి సంస్థలు విమాన చార్జీలను కూడా తగ్గించాయి. అంతే కాకుండా ప్రత్యేక విమానాలను నడిపించాయి.
అయితే.. పలు ప్రాంతాల్లో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని.. స్థానికులు పర్యాటకులను స్వాగతిస్తున్నారని, పర్యాటకులు భయపడకుండా తమ యాత్రలను కొనసాగించాలని అధికారులు చెబుతున్నారు.
పర్యాటనలు రద్దు:
ఈ దాడి తరువాత.. కాశ్మీర్‌లోని రిసార్ట్‌లు మూసివేయబడ్డాయి. ఇది పర్యాటక రంగానికి భారీ నష్టం కలిగించింది. తిరిగి పుంజుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి.
విమాన సంస్థలు:
పర్యాటకులు తమ టూర్ లను రద్దు చేసుకోవడం వల్ల విమాన సంస్థలు ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, ఈజ్‌మైట్రిప్ వంటి సంస్థలు 30 ఏప్రిల్ 2025 వరకు.. శ్రీనగర్‌కు వెళ్లే లేదా అక్కడి నుండి వచ్చే బుకింగ్స్‌పై ఛార్జీలను రద్దు చేశాయి.
Also Read: ఇక్కడ సమ్మర్‌లోనూ.. పరవళ్లు తొక్కే జలపాతాలు, చూస్తే మైమరచిపోతారు
స్థానికుల స్పందన:
పాహల్గామ్‌లో జరిగిన దాడి తరువాత.. స్థానికులు పర్యాటకులను స్వాగతించేందుకు ముందుకొచ్చారు. కలకత్తా నుండి వచ్చిన కొందరు పర్యాటకులు.. స్థానికులు తమను స్నేహపూర్వకంగా స్వాగతించారని మీడియాకు తెలిపారు. ఎలాంటి భయం లేకుండా పర్యటనలు కొనసాగించారు .
భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి:
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి.. కాశ్మీర్‌లో పర్యాటక రంగానికి గణనీయమైన నష్టాన్ని కలిగించింది. భద్రతా పరిస్థితులు మెరుగుపడితే.. పర్యాటకులు తిరిగి వస్తారని అధికారులు స్థానికులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం భద్రతా చర్యలను కఠినంగా అమలు చేస్తే.. పర్యాటక రంగం పునరుద్ధరించబడుతుంది.