Bihar Railway Station Viral Video: తాజాగా ఓ రైల్వే స్టేషన్‌లో జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్లాట్ ఫారమ్ మీద ఉన్న చిప్స్ ప్యాకెట్లను ప్రయాణికులు దోపిడీ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత చిల్లరగా ప్రవర్తించడం ఏంటని మండిపడుతున్నారు.
బీహార్ లో ఓ రైలు స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఓ వ్యాపారి చిప్స్ ప్యాకెట్లను ప్లాట్ ఫారమ్ మీద దించాడు. వాటిని తీసుకెళ్లేందుకు రిక్షాను పిలుచుకొని వచ్చేందుకు బయటకు వెళ్లాడు. ఈ సమయంలోనే రైల్లోని కొంత మంది ప్రయాణికులు ఆ చిప్స్ ప్యాకెట్స్ చూశారు. అందులో ఓ వ్యక్తి ఓ చిప్స్ ప్యాకేట్ ను తీసుకున్నాడు. వెంటనే, అక్కడ ఉన్న మిగతా ప్రయాణికులు కూడా ఈ చిన్స్ ప్యాకెట్స్ కోసం ఎగబడ్డారు. వాటికోసం ఏకంగా తొక్కసలాట జరిగింది. కాసేపట్లోనే చిప్స్ ప్యాకెట్స్ అన్నీ అయిపోయాయి. ఖాళీ కాటన్స్ మాత్రమే మిగిలాయి.
ఒక్కసారిగా చిప్స్ కోసం ప్రయాణికులు కొట్లాడటాన్ని చూసి రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన వెంటనే చాలామంది ప్రయాణికులు చిప్స్ ప్యాకెట్లను తీసుకుని రైళ్లలోకి వెళ్లిపోయారు. బయటికి వెళ్లిన వ్యాపారి రిక్షాను తీసుకొని వచ్చేసరికి అక్కడ ఏం లేకపోవడంతో షాకయ్యాయి.
అక్కడే ఉన్న కొంతమంది ప్రయాణికులు ఈ ఘటనకు సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాసేపట్లోనే వైరల్ అయ్యింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ప్రయాణికుల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. అమ్ముకోవడానికి తీసుకొచ్చిన చిప్స్ ను ఇలా దోపిడీ చేయడం దారుణం అంటున్నారు. వాటిని అమ్మి కుటుంబాన్ని పోషించాలనుకునే వ్యాపారి పరిస్థితి ఏంటని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. కనిపించి వస్తువులను దొంగిలించాలనుకునే అలవాటు దారుణం అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఘటనతో పబ్లిక్ ప్రదేశాల్లో జనాలు ఎలా ప్రవర్తించాలనే అంశం మరోసారి చర్చకు వచ్చింది. రైల్వే స్టేషన్ల లాంటి రద్దీ ప్రాంతాల్లో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని ఈ సంఘటన గుర్తు చేసింది. ఎవరైనా అక్కడ పెట్టిన వస్తువులను దొంగిలించాలనే ఆలోచన కంటే, వాటి యజమాని ఎవరో తెలుసుకోవడం, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం లాంటి బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. బీహార్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన కొద్దిసేపట్లో ముగిసిపోయినా, ఆ ఘటన జరిగిన తీరుపై దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఒక వైరల్ వీడియోగా ప్రారంభమైన ఈ సంఘటన ఇప్పుడు జనాల స్పృహ, బాధ్యత, సామాజిక ప్రవర్తన లాంటి అంశాలపై విస్తృత చర్చకు కారణమైంది. రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?