Kashmir Vande Bharat Express: కాశ్మీర్ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైల్వే లైన్ ప్రారంభం కాబోతోంది. ఇకపై నేరుగా శ్రీనగర్ ను కనెక్ట్ చేసే రైల్వే మార్గం అందుబాటులోకి రాబోతోంది. ఈ వారంలోనే శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా నుంచి కాశ్మీర్‌కు రైలు సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. కత్రా- బారాముల్లా మధ్య వందే భారత్ రైలు పరుగులు తీయబోతోంది. కాశ్మీర్‌కు రైలు సర్వీసులను ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 6న కాశ్మీర్ లోయకు ప్రధానమంత్రి మొదటి రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.
ఏప్రిల్ 19నే ప్రారంభం కావాల్సి ఉన్నా..
కాశ్మీర్ కు రైలు సర్వీసును ఏప్రిల్ 19నే ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ.. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో వాయిదా వేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ కారణంగా మరింత ఆలస్యం జరిగింది. భారత సాయుధ దళాలు పాకిస్తాన్ తో పాటు పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై మే 7 నుంచి 10 వరకు దాడులు చేశాయి. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో జూన్ 6న ఈ రైల్వే లైన్ ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 3న ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగే అమర్‌నాథ్ యాత్రకు ఈ రైల్వే లైన్ ఎంతగానో ఉపయోగపడనుంది. నిజానికి ఈ సమయంలో వర్షాలు కురవడం వల్ల రోడ్డు మార్గపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడి రవాణాకు ఇబ్బంది కలుగుతుంది. రైల్వే లైన్ ప్రారంభం అయితే, భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లే అవకాశం ఉంటుంది.
కత్రా- బారాముల్లా వందేభారత్ రైలు ప్రారంభం
జూన్ 6న ప్రధాని మోడీ కత్రా-బారాముల్లా మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రారంభిస్తారు. ఆ తర్వాత కత్రా స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కత్రా నుంచి రైల్వే సేవలను ప్రారంభించే ముందు, చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను ప్రధాని మోడీ పరిశీలించనున్నారు. అదే సమయంలో రియాసి జిల్లాలోని రైల్వే ట్రాక్‌పై ఉన్న మొదటి కేబుల్ వంతెనను సందర్శిస్తారు. జమ్మూ రైల్వే స్టేషన్‌లో విస్తరణ పనులు పూర్తయిన తర్వాత, ప్లాట్ ఫారమ్‌ల సంఖ్య పెరగనుంది. ఆగస్టు-సెప్టెంబర్‌లో జమ్మూ నుంచి నేరుగా కాశ్మీర్ లోయకు రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ నుంచి నేరుగా కాశ్మీర్ కు రైలు సర్వీసులు లేవు. ప్రయాణీకులు కత్రాలో దిగి రైలు మారాల్సి ఉంటుంది. ఆ తర్వాత జమ్మూలోనూ దిగాల్సి ఉంటుంది. కానీ, ఇకపై ఢిల్లీతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి నేరుగా రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
రూ. 41 వేల కోట్లతో USBRL ప్రాజెక్టు
మొత్తం 272 కిలోమీటర్ల ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 41,000 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికే 209 కిలో మీటర్ల రైల్వే లైన్ ను దశలవారీగా ప్రారంభించింది. 118 కిలోమీటర్ల ఖాజిగుండ్-బారాముల్లా సెక్షన్ మొదటి దశ అక్టోబర్ 2009లో ప్రారంభించబడింది, జూన్ 2013లో 18 కిలోమీటర్ల బనిహాల్-ఖాజిగుండ్, జూలై 2014లో 25 కిలోమీటర్ల ఉధంపూర్-కత్రా, గత సంవత్సరం ఫిబ్రవరిలో 48.1 కిలోమీటర్ల పొడవైన బనిహాల్-సంగల్దాన్ స్ట్రెచ్ పనులు ప్రారంభం అయ్యాయి. 46 కిలోమీటర్ల సంగల్దాన్-రియాసి సెక్షన్ పనులు కూడా గత సంవత్సరం జూన్‌లో పూర్తయ్యాయి, రియాసి- కత్రా మధ్య మొత్తం 17 కిలోమీటర్ల దూరం మిగిలిపోయింది. మూడు నెలల క్రితం ఈ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ లైన్ లో వందే భారత్‌తో సహా వివిధ రైళ్లు ట్రయల్స్ నిర్వహించాయి.
Read Also: చెర్రీలతో బయల్దేరిన పార్శిల్ రైలు, ఇండియన్ రైల్వేలో సరికొత్త అధ్యాయం!