Brazil Plane Crash: బ్రెజిల్ లో మరోసారి ఘోర విమాన ప్రమాదం జరిగింది. చిన్న విమానం దుకాణ సముదాయం మీదికి దూసుకెళ్లి కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని 10 మంది చనిపోయారు. మరో 15 మంది స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
సౌత్ బ్రెజిల్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం అయిన గ్రామాడోలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. కొంత మంది విదేశీ ప్రయాణీకులు సిటీ అందాలను చూసేందుకు చిన్న విమానం ఎక్కారు. కొద్ది దూరం ఈ విమానం సాఫీగానే ప్రయాణించింది. ఆ తర్వాత చిన్న టెక్నికల్ సమస్య తలెత్తడంతో విమానం గ్రామాడోలోని దుకాణ సముదాయాలకు తగిలింది. ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగాయి. అక్కడే కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో 10 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తున్నది. వారంతా స్పాట్ లోనే చనిపోయారని పౌర, రక్షణ శాఖల అధికారులు వెల్లడించారు. “విమాన ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉంది. ఫ్లైట్ లో మంటలు చెలరేగి కాలి బూడిద అయ్యింది. విమానంలో ఉన్న ఏ ఒక్కరూ బతికే అవకాశం లేదు” అని గ్రామాడో గవర్నర్ ఎడౌర్డో లెల్టే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
JUST IN – Governor of Brazil's Rio Grande do Sul says no survivors after plane carrying 10 people crashed into multiple buildings in Gramado pic.twitter.com/QAdo1Y5PRH
— Insider Paper (@TheInsiderPaper) December 22, 2024
15 మందికి గాయాలు, పలువురి పరిస్థితి విషమం
అటు ఈ విమాన ప్రమాదంలో సుమారు 15 మంది గాయపడ్డారు. వారందరికీ హాస్పిటల్ కు తరలించారు. ప్రత్యేక వైద్యబృందం సమక్షంలో వారికి చికిత్స కొనసాగుతుంది. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు ప్రజా భద్రతాధికారి కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఎక్కువ మంది విమానం నుంచి వచ్చిన పొగ కారణంగా శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. విమానం షాపులపైకి దూసుకు రావడంతో మంటలు చెలరేగాయి. అదే సమయంలో విపరీతమైన ప్రమాదకరమైన పొగ వ్యాపించింది. ఈ పొగ పీల్చిన వాళ్లంతా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి.
చిమ్నీని తాగడంతో విమానం క్రాష్
10 మంది ప్రయాణీకులతో వెళ్తున్న విమానం తొలుత ఒక ఇంటి మీద ఉన్న చిమ్నీని తాకింది. ఆ తర్వాత విమానం బ్యాలెన్స్ కోల్పోయి ఎదురుగా ఉన్న భవనం రెండో ఫ్లోర్ లోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న దుకాణ సముదాయంలోని ఫర్నీచర్ స్టోర్ లో కుప్పకూలిందని అధికారులు తెలిపారు.
రీసెంట్ గా వరదల బీభత్సం
బ్రెజిల్ పర్వత ప్రాంతంలోని గ్రామాడో ఆ దేశంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. రీసెంట్ గా అక్కడ అసాధారణ వరదల సంభవించాయి. ఈ ఘటనలో భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ ఉండగా ఇప్పుడు విమాన ప్రమాదం జరిగడంతో స్థానికంగా విషాదం నెలకొన్నది.
Read Also: రష్యాకు ఉక్రెయిన్ ఊహించని షాక్.. ఏకంగా ఆ ప్రాంతంపైకి డ్రోన్ల దండు.. భారీ నష్టం