Indian Railways Super App: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే అన్ని రైల్వే సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తూ గత కొంత కాలంగా ఓ సూపర్ యాప్ ను రూపొందిస్తున్నది. ఇప్పటి వరకు రైల్వే ప్రయాణం చేసే ప్యాసింజర్లు రైల్వేలోని రకరకాల సేవలను పొందేందుకు పలు రకాల యాప్స్, వెబ్ సైట్లు వినియోగించాల్సి వస్తున్నది. అన్ లైన్ టికెట్ల బుకింగ్, క్యాన్సిలేషన్ కోసం IRCTC వెబ్ సైట్, యాప్ ఉపయోగిస్తున్నారు. అన్ రిజర్వుడ్ టికెట్ల కోసం UTS యాప్, ఫుడ్ ఆర్డర్ కోసం IRCTC e-Catering యాప్, కంప్లైంట్స్, ఫీడ్ బ్యాక్ కోసం ‘రైల్ మదద్’ అనే యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కో రైల్వే సేవకు ఒక్కో యాప్ ను, వెబ్ సైట్ ను ఉపయోగించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఇకపై ఆ ఇబ్బందులకు చెక్ పెట్టబోతున్నది రైల్వేశాఖ. ఈ మేరకు రైల్వే సూపర్ యాప్ ‘స్వరైల్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
సూపర్ యాప్ ను రూపొందించిన CRIS
ఇక ఈ అత్యాధునిక రైల్వే యాప్ ‘స్వరైల్’ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) డెవలప్ చేసింది. ఇక రైల్వేలోని అన్ని సేవలు ఈ యాప్ లోనే లభించనున్నాయి. టికెట్ బుకింగ్, లైవ్ లొకేషన్, PNR స్టేటస్, ట్రాకింగ్ సిస్టమ్, ఫుడ్ ఆర్డర్ సహా అన్ని సేవలను ఈ యాప్ లోనే పొందే అవకాశం ఉంటుంది. తాజాగా ఈ యాప్ ను విడుదల చేసింది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది. కేవలం 1000 మంది మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది రైల్వేశాఖ. టెస్టింగ్ పూర్తి అయిన తర్వాత ప్రజలందరికీ అందుబాటులోకి రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. “తాజాగా విడుదల చేసిన ‘స్వరైల్’ యాప్ కేవలం1,000 మంది వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకోగలరు. ఈ 1000 మందికి సంబంధించిన ఫీడ్ బ్యాక్, సర్వీసులను గమనించి పని తీరును అంచనా వేస్తాం. లోటు పాట్లను సవరించి.. ఆ తర్వాత 10,000 డౌన్ లోడ్ లకు అందుబాటులో ఉంచుతాం. ఆ తర్వాత అందరూ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తాం. వినియోగదారులకు ఈజీ ఇంటర్ ఫేస్ ద్వారా మెరుగైన సేవలు అందించడమే ఈ యాప్ లక్ష్యం. అన్ని రైల్వే సేవలను ఒకే చోట అందించే ప్రయత్నం చేస్తున్నాం” అని రైల్వే బోర్డులోని సమాచార, ప్రచార కార్యనిర్వాహక డైరెక్టర్ దిలీప్ కుమార్ వెల్లడించారు.
Indian Railways launches ‘SwaRail’ SuperApp for Beta Testing – final public launch after trials: A One-Stop Solution for Seamless Railway Services
🔘SwaRail’ SuperApp Integrates Multiple Railway Services, Reduces App Clutter and Space Usage
🔘‘SwaRail’ SuperApp Provides… https://t.co/4vpf9jYTLE pic.twitter.com/gCppNL3DA7
— PIB India (@PIB_India) February 1, 2025
థర్డ్ పార్టీ యాప్ సేవలతో భద్రతా ఇబ్బందులు
ప్రస్తుతం చాలామంది ప్రయాణీకులు లైవ్ లోకేషన్, ఫీడ్ బ్యాక్ లాంటి సేవలను పొందేందుకు థర్డ్ పార్టీ యాప్ లను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ యాప్స్ తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ‘స్వరైల్’ యాప్ అందుబాటులోకి వస్తే ప్రయాణీకులకు ఈ సమస్యలన్నీ తీరే అవకాశం ఉంటుంది. ఈ యాప్ ద్వారా సేఫ్, సెక్యూరిటీ సేవలు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈజీగా లాగిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారులకు పలు రకాల లాగిన్ ఆప్షన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకసారి లాగిన్ అయిన తర్వాత, యాప్ ని mPIN లేదంటే బయోమెట్రిక్ ద్వారా కూడా యాక్సెస్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతం ‘స్వరైల్’ యాప్ ప్లే స్టోర్/యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.