Vande Bharat Express News: భారతీయ రైల్వే వ్యవస్థలో వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టాయి. ప్రపంచ స్థాయి వసతులు కల్పించడంతో పాటు అత్యంత వేగంగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వందేభారత్ రైల్లో ప్రయాణం చేందుకు మొగ్గు చూపుతున్నారు. సాధారణ రైళ్లతో పోల్చితే వీటి టికెట్ ధర ఎక్కువ అయినప్పటికీ, ఇందులోనే వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చాలా చోట్ల వందేభారత్ రైళ్లలో ప్రయాణీకులు సామర్థ్యానికి మించి ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాల్లో అదనపు కోచ్ లు యాడ్ చేయాలని భావిస్తున్నారు.
రద్దీ రూట్లలో పెరగనున్న కోచ్ లు
అత్యంత రద్దీ ఉన్న మార్గాల్లో మధురై రైల్వే డివిజన్ లోని తిరునెల్వేలి- చెన్నై ఎగ్మోర్ రూట్ ఒకటి. ఈ మార్గంలో ప్రస్తుతం ఎనిమిది కోచ్ లతో వందే భారత్ రైలు నడుస్తోంది. ఈ రూట్ లోని ప్రీమియం రైలుకు ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రైలును 8 కోచ్‌ల నుంచి 16 కోచ్ లకు మార్చాలని భావిస్తున్నారు. తిరునెల్వేలి-చెన్నై ఎగ్మోర్- తిరునెల్వేలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను గత ఏడాది సెప్టెంబర్ లో ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇది దక్షిణ తమిళనాడుకు మొదటి వందే భారత్ రైలు.
ప్రయాణీకుల నుంచి భారీ డిమాండ్
తిరునెల్వేలి- చెన్నై ఎగ్మోర్ లను కలిపే ఈ వందే భారత్ రైలు టైమింగ్స్ ప్రయాణీకులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. రైలు తిరునెల్వేలి నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుంది. ఈ రైలు మదురై, తిరుచ్చి ప్రయాణీకులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ స్టేషన్లకు ఉదయం 7:50, 9:50 గంటలకు చేరుకుంటుంది. అటు ఈ రైలు చెన్నై ఎగ్మోర్ నుంచి మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి రాత్రి 10:40 గంటలకు తిరునెల్వేలి చేరుకుంటుంది. సాయంత్రం 6:40 గంటలకు తిరుచ్చి, 8.30 గంటలకు మధురై చేరుకుంటుంది. సో, చెన్నై నుంచి వెళ్లే ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే, ఈ రూట్ లో ఎక్కువ రద్దీ ఉంటుంది.
Read Also: వార్ని.. 4 గంటల్లోనే బెంగళూరుకు? ఈ వందేభారత్ ట్రైన్ చాలా స్పీడు గురూ!
కోచ్ ల పెంపు కోరుతూ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు
అత్యంత డిమాండ్ ఉన్న ఈ రూట్ లో కోచ్ ల సంఖ్య పెంచాలని కోరుతూ మధురై రైల్వే డివిజన్ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఉన్న 8 కోచ్ లకు బదులుగా 16 కోచ్ లను జోడించాలని కోరింది. “ఈ రైలును 16 కోచ్ లుగా మార్చే ప్రతిపాదనను రైల్వే బోర్డు ఆమోదిస్తుందని భావిస్తున్నాం. ఇదే జరిగితే ఈ రైలులో ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది” అని మధురై డివిజనల్ రైల్వే మేనేజర్ శరద్ శ్రీవాస్తవ తెలిపారు.
Read Also: వచ్చేస్తోంది.. బుల్లెట్ ట్రైన్, నెక్ట్స్ ఈ రూట్లలోనే పరుగు.. మన తెలుగు రాష్ట్రాలు?