New High Speed Bullet Trains Corridors: భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైల్వే సంస్థపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దశాబ్దాలు కొనసాగుతున్న మూస ధోరణికి ఆధునిక హంగులు తీసుకొచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే మేకిన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశ రైల్వే ముఖ చిత్రాన్ని ఈ రైళ్లు పూర్తిగా మార్చివేశాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రయాణీకులకు మెరుగైన వసతులు కల్పిస్తూ శరవేగంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. వందేభారత్ రైళ్లు రోజు రోజుకు అప్ డేట్ అవుతూ ప్రయాణీకులకు మెరుగైన సర్వీసులను అందిస్తున్నాయి.
శరవేగంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు
ఓవైపు సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి రాగా, మరోవైపు బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం అహ్మాదాబాద్- ముంబై మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అహ్మదాబాద్-ముంబై మధ్య 508 కిలో మీటర్ల మేర తొలి హైస్పీడ్ కారిడార్ నిర్మాణం అవుతోంది. ఈ రూట్ లో గంటకు 320 కి.మీ వేగంతో బుల్లెట్ రైళ్లు ప్రయాణించనున్నాయి. కేవలం రెండు గంటల వ్యవధిలో బుల్లెట్ రైళ్లు రెండు నగరాలను కలపనున్నాయి. సూరత్, వడోదరతో పాటు 12 పరిమిత స్టాపులలో బుల్లెట్ ట్రైన్ హాల్టింగ్ కు అవకాశం ఉంటుంది.
జపాన్ టెక్నాలజీ సాయంతో..
ముంబై-అహ్మదాబాద్ నడుమ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం జపాన్ సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తున్నది. 508 కిలో మీటర్లలో ఇప్పటి వరకు 336 కిలో మీటర్ల పీర్ ఫౌండేషన్, 225 కిలో మీటర్ల గిర్డర్ లాంచింగ్ పూర్తయ్యింది. ఈ ప్రాజెక్టులో కీలకమైన 21 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మాణం సైతం ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఈ మార్గంలో మొత్తం 24 బ్రిడ్జిలు, ఏడు కొండలకు సొరంగాలను పూర్తి చేయనున్నారు. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ నిర్మాణాల కోసం నిరంతరంగా పని చేస్తున్నది. 2026లో ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ల కొత్త కారిడార్లకు ప్రణాళికలు
ఓ వైపు ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుండగా, మరోవైపు దేశ వ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో హై స్పీడ్ ట్రైన్ కారిడార్ల కోసం ప్రణాళికలను రెడీ అవుతున్నాయి. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ భవిష్యత్ కారిడార్ల కోసం డీపీఆర్ లు రెడీ సిద్ధం చేస్తున్నది.
హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కొత్త కారిడార్లు ఇవే!
అటు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కొత్త కారిడార్లపై నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చింది. ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-అహ్మదాబాద్, ఢిల్లీ-అమృతసర్, ముంబై-నాగ్‌పూర్ నడుమ కొత్తకారిడార్లను నిర్మించాలని భావిస్తున్నది. ఇందులో భాగంగానే అధికారులు డీపీఆర్ లను రూపొందిస్తున్నారు.
Read Also: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి, దీని ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!