Indian Railway Super App: రైల్వే ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో రైల్వే సంస్థ ముందుంటుంది. అందులో భాగంగానే రైల్వే సేవలను మరింత సులభతరం చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రైల్వే సంస్థ సరికొత్త సూపర్ యాప్‌ను తీసుకువస్తోంది. రైల్వేకు సంబంధించిన అన్ని సర్వీసులను ఒకే చోట చేర్చి ఈ యాప్ ను రూపొందిస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం టికెట్ బుకింగ్ కోసం ప్రయాణీకులు IRCTC యాప్ తో పాటు వెబ్ సైట్ ను ఉపయోగిస్తున్నారు. రైలు రన్నింగ్ స్టేటస్ ను తెలుసుకునేందుకు, PNR స్టేటస్ చెక్ చేసుకునేందుకు మరో యాప్ ను యూజ్ చేస్తున్నారు. రైల్వేకు సంబంధించిన రకరకాల సేవలను రకరకాల యాప్ లలో చూడాలంటే ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతున్నది. ఈ నేపథ్యంలో రైల్వే సరికొత్త సూపర్ యాప్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.
‘సూపర్ యాప్’ అంశాన్ని ప్రస్తావించిన టీడీపీ ఎంపీలు
తాజాగా లోక్ సభలో టీడీపీ ఎంపీలు బీకే పార్థసారథి, బస్తిపాటి నాగరాజు రైల్వేకు సంబంధించిన ‘సూపర్ యాప్’ అంశాన్ని ప్రస్తావించారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేలా రూపొందించే ఈ యాప్ ను త్వరగా విడుదల చేయాలని కోరారు. ఈ ప్రశ్నలకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. “భారతీయ రైల్వే సంస్థ.. ప్రయాణీకుల సేవలను దృష్టిలో ఉంచుకునే యాప్ ను అభివృద్ధి చేస్తోంది. ప్రయాణీకులు ఒకే యాప్ లో టికెట్ బుకింగ్స్, టికెట్ క్యాన్సిలేషన్, కంప్లైంట్స్, రైళ్లలో బెర్తుల లభ్యత, రైలు ట్రాకింగ్, PNR స్టేటస్ తనిఖీ సహా అనేక సదుపాయాలను పొందేలా దీనిని రూపొందిస్తున్నది. వీలైనంత త్వరగా ఆ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం” అని తెలిపారు.
Read Also: వార్ని.. 4 గంటల్లోనే బెంగళూరుకు? ఈ వందేభారత్ ట్రైన్ చాలా స్పీడు గురూ!
దశాబ్ద కాలంలో మారిన రైల్వే ముఖచిత్రం
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. భారతీయ రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. “ప్రధానిగా మోడీ బాధ్యతలు తీసుకున్న తర్వాత రైల్వే వ్యవస్థను మెరుగు పరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత దశాబ్ద కాలంగా రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం కృషి చేస్తున్నది. భారతీయ రైల్వేకు డిజిటల్ మెరుగులు అద్దుతున్నది. అందులో భాగంగానే సూపర్ యాప్ ను తీసుకొస్తున్నది. ప్లాట్ ఫారమ్ నుంచి జనరల్ టికెట్ వరకు ఆన్‌లైన్ మోడ్ లో కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. గతంలో పోల్చితే మరింత సులభంగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపై లైన్లలో నిలబడే అవసరం లేదు. ప్రస్తుతం రైల్వేకు సంబంధించి ఆన్ లైన్ సేవలు వివిధ ప్లాట్ ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఒకే చోటుకి తీసుకొచ్చేందుకు ‘ఈ సూపర్ యాప్’ రెడీ అవుతోంది” అని తెలిపారు.
Read Also: వందే భారత్ రైళ్లలో విపరీతమైన రద్దీ.. ఈ రూట్లలో పెరగనున్న కోచ్‌ల సంఖ్య!