Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలంటే పెద్ద తతంగం ఉంటుంది. ముందుగా ఆర్టీఏ ఆఫీస్ కు వెళ్లాలి. వ్యాలిడిటీ అయిపోతున్న డ్రైవింగ్ లైసెన్స్ జీరాక్స్, ఆధార్ కార్డు జీరాక్స్ పెట్టి, సంబంధిత ఫామ్ ఫిలప్ చేయాలి. ముందుగా మీసేవ ద్వారా ఆన్ లైన్ చేయించుకోవాలి. స్లాట్ బుక్ చేసుకోవాలి. వాళ్లు ఇచ్చిన టైమ్ కు వెళ్లి, ఆర్టీఏ ఆఫీస్ కౌంటర్ లో ఫోటో దిగాగాలి. సంబంధిత ఫైల్ ను తీసుకెళ్లి అధికారులకు అందివ్వాలి. వాళ్లు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో పాస్ అయితే, రద్దీని బట్టి రెన్యువల్ అయిన కార్డు పోస్టు ద్వారా ఇంటికి పంపిస్తారు. ఇందంతా అయ్యేందుకు సుమారు 10 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. కానీ, ఆర్టీఏ ఆఫీస్ కు వెళ్లకుండా, డ్రైవింగ్ టెస్ట్ చేయకుండా, కేవలం రెండు నిమిషాల్లో రెన్యువల్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ చేతికి వస్తే? వినడానికి ఆశ్చర్యంగా ఉందా? కానీ, ఇది ముమ్మాటికీ నిజం. కాకపోతే మన దగ్గర కాదండోయ్..
2 నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్
దుబాయ్ ప్రభుత్వం ఈ అద్భుతమైన సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ పౌరులు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం డ్రైవింగ్ లైసెన్స్ సేవలతో పాటు పలు రకాల సేవలను డిజిటల్ మిషన్ల ద్వారా అందిస్తోంది. ఆయా సర్వీసులను నిమిషాల వ్యవధిలో పొందే అవకాశం ఉంటుంది. ఈ మేరకు 32 స్మార్ట్ కియోస్క్ లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
RTA స్మార్ట్ కియోస్క్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్
దుబాయ్ లో సులభంగా, వేగంగా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవచ్చు. క్యూలైన్ లో నిలబడే ఇబ్బంది లేకుండా రెండు నిమిషాల్లో ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. మన దగ్గర ఏటీఎం సెంటర్లు ఉన్నట్లుగానే దుబాయ్ లో సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ లను పలు ప్రదేశాల్లో అందుబాటులో ఉంచారు. వీటి ద్వారా పలు రకాల సేవను పొందే అవకాశం ఉంటుంది.
⦿ ముందుగా సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ మిషన్ దగ్గరికి వెళ్లాలి. మిషన్ డిస్ ప్లే మీద ప్రభుత్వం అందించే పలు సర్వీసుల వివరాలు కనిపిస్తాయి.
⦿ వాటిలో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
⦿ ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఎక్స్ పైరీ డేట్ సహా ఇతర వివరాలను నమోదు చేయాలి.
⦿ మీ పాత డ్రైవింగ్ లైసెన్స్ డిస్ ప్లే అవుతుంది. వెంటనే రెన్యువల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
⦿ ఆ తర్వాత రెన్యువల్ కు సంబంధించిన పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మనం ఫోన్ పే స్కాన్ చేసినట్లుగానే చేయాల్సి ఉంటుంది.
⦿ పేమెంట్ పూర్తి కాగానే, డ్రైవింగ్ లైసెన్స్ ప్రింట్ అయి బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా కొనసాగేందుకు కేవలం 2 నిమిషాల సమయం పడుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఇలాంటి విధానం మన దగ్గర కూడా వస్తే భలే ఉంటుంది అంటున్నారు.
Read Also: షాకింగ్.. మీ వాహనం ఎంత పాతది? ఇకపై మీకు పెట్రోల్ పొయ్యరు!