ఒడిషాలోని పలు మార్గాలు అటవీ ప్రాంతం గుండా వెళ్తాయి. ముఖ్యంగా బిస్రా- బోండముండా డివిజన్ల మధ్య తరచుగా ఏనుగులు రైల్వే ట్రాక్స్ మీదికి వస్తాయి. కొన్నిసార్లు రైళ్లు ఢీకొని ఏనుగులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏనుగులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా రైల్వే అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే తాజాగా ఏనుగుల గుంపు సురక్షితంగా రైల్వే ట్రాక్ దాటడానికి వీలుగా సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER) నవంబర్ 1 తెల్లవారుజామున పలు గంటల పాటు రైలు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు రైల్వే జోన్ అధికారులు కీలక ప్రకటన చేశారు. అటవీ శాఖ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ 13 ఎక్స్ ప్రెస్ రైళ్లతో పాటు మరికొన్ని గూడ్స్ రైళ్లను నిలిపివేసినట్లు వెల్లడించారు.
రైల్వే ట్రాక్స్ దగ్గర ఏనుగులు గుంపులు కనిపించినట్లు అటవీశాఖ అధికారులు, రైల్వే అధికారులకు సమాచారం అందించారు. వారి సూచనలో రైల్వే సేవలను నిలిపివేసినట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారులు తెలిపారు. బిస్రా- బోండముండా మధ్య అన్ని మార్గాల్లో సేవలు రాత్రి 12:10 గంటల నుంచి నిలిపివేసినట్లు వెల్లడించారు. డౌన్ లైన్ 02:30 తర్వాత తాత్కాలిక వేగ పరిమితితో తిరిగి ప్రారంభించబడినట్లు తెలిపారు. ఫీల్డ్ తనిఖీలు చేసిన అనంతరం ఏనుగుల గుంపులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించిన తర్వాత 04:45 గంటలకు సాధారణ వేగాలను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఏనుగుల గుంపు కారణంగా నిలిపివేసిన రైళ్లలో పలు కీలక ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. వాటిలో 12905 షాలిమార్-షాలిమార్ SF ఎక్స్ ప్రెస్, 12151 సమంత ఎక్స్ ప్రెస్, 18190 ఎర్నాకులం-టాటానగర్ ఎక్స్ ప్రెస్, 12809 ముంబై CSMT-హౌరా మెయిల్, 12810 హౌరా-ముంబై CSMT మెయిల్ రైళ్లు ఉన్నాయి. ట్రాక్ ను క్లియర్ అయ్యే వారకు ప్రత్యేక రైళ్లను కూడా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
Read Also: వందేళ్లుగా.. ఒకే మార్గంలో నడుస్తున్న ఈ రైళ్ల గురించి తెలుసా? నిజంగా గ్రేట్!
ఈ సంవత్సరం జూలైలో ఝర్‌గ్రామ్ అడవి సమీపంలోని ఖరగ్ పూర్- టాటానగర్ లైన్ లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రమాదంలో ఏడు ఏనుగుల గుంపును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు ఏనుగులు మృతి చెందాయి. ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకునేందుకు రైల్వే, అటవీ అధికారులు రియల్-టైమ్ పర్యవేక్షణ, సమన్వయాన్ని కొనసాగిస్తున్నారు. అదే సమయలో 2014-2020 మధ్య ఈ జోన్ పరిధిలో రైల్వే ప్రమాదాల కారణంగా 13 ఏనుగులు చనిపోయినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే వన్యప్రాణుల క్రాసింగ్ పాయింట్ల దగ్గర పర్యవేక్షణ, ప్రతిస్పందన వ్యవస్థలను మెరుగుపరచడానికి అటవీ అధికారులతో కలిసి పని చేస్తూనే ఉంటుందని జోన్ అధికారులు వెల్లడించారు.
Read Also: విమానాలకు ఎడమ వైపే ఎంట్రీ ఎందుకు ఉంటుంది? కుడి వైపు డోర్ ఎందుకు ఉండదు? కారణం ఇదేనట!