Wine shops closed: మందుబాబులకు బిగ్ షాకిచ్చే న్యూస్ అంటే ఇదేనేమో.. ఎందుకంటే రెండు రోజులపాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ప్రధానంగా ఈ 2 రోజులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బంద్ ఏర్పడబోతోంది. దీనితో మందుబాబులకు ఇదొక బిగ్ షాక్ ఇచ్చే న్యూస్ అని చెప్పవచ్చు.
అసలు విషయానికి వస్తే… హైదరాబాద్ నగరంలో ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే శ్రీ ఉజ్జయినీ మహంకాళి జాతరకు నగరంలోని వాతావరణం సిద్ధమవుతోంది. జూలై 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి జూలై 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ పుణ్యక్షేత్ర జాతర నేపథ్యంలో ప్రత్యేక నియంత్రణలు అమలులోకి రాబోతున్నాయి. అందులో ముఖ్యమైనదే.. 48 గంటల పాటు వైన్ షాపులపై తాళాలు పడే వ్యవహారం!
ఎక్కడెక్కడ మద్యం బంద్?
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, మొత్తం 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో వచ్చే ప్రాంతాల్లో ఉన్న అన్ని మద్యం దుకాణాలు పూర్తిగా మూతపడనున్నాయి. జాతర సందర్భంగా భద్రతా పరంగా, శాంతిభద్రతలు తప్పకుండా నిర్వహించాల్సిన పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పోలీస్ శాఖ తెలిపింది.
ఈ షాపుల్లో.. నో లిక్కర్!
మూతబడనున్న షాపుల జాబితాలో ప్రధానంగా గాంధీనగర్, చిక్కడపల్లి, లల్లగూడ, వరసిగూడ, బేగంపేట్, గోపాలపురం, తుకారాంగేట్, మారేడ్‌పల్లీ, మహంకాళి, రామ్‌గోపాల్‌పేట్, మొండా మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న అన్ని మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎవ్వరూ ఏ విధంగా మద్యం విక్రయించకూడదు. సీసా బాటిళ్లు అమ్మితేనే కాదు, క్లబ్బులు, బార్‌లు, క్యాంటీన్లు అన్నీ పూర్తిగా మూతపడాల్సిందే. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరించింది.
Also Read: Fake kallu: కల్తీ కల్లు గుర్తించడం ఎలా? ఇలా చేయండి.. ఇట్టే పసిగట్టేయండి!
ఇదంతా ఎందుకంటే… ఉజ్జయినీ మహంకాళి జాతర సందర్భంగా వేలాదిమంది భక్తులు హైదరాబాద్‌కి వస్తారు. ముఖ్యంగా సికింద్రాబాద్ మహంకాళి దేవాలయంలో జరగనున్న ఈ ఉత్సవానికి భారీగా జనసందోహం వచ్చే అవకాశముంది. బోనాల, ఊరేగింపులు, ప్రత్యేక పూజలు, సంప్రదాయ వేడుకలు అన్నీ జరగబోతున్నాయి. భక్తుల రద్దీ, శ్రద్ధలు, భద్రత ఇలా అన్నింటిని జాగ్రత్తగా నిర్వహించాల్సిన నేపథ్యంలో కొన్ని నియంత్రణలు తప్పనిసరి.
ఇలాంటి సమయంలో మద్యం దుకాణాలను తెరిచిపెడితే, అశాంతి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో 48 గంటల పాటు పూర్తిగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి ఇలాంటి ఆంక్షలు ప్రతి సంవత్సరం ఈ జాతర సందర్భంగా అమలవుతూనే ఉంటాయి. కానీ ఈసారి ముందుగానే హెచ్చరించి మరీ ప్రజలకు తెలియజేయడం జరిగింది.
ఇక జాతర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ డైవర్షన్లు, పోలీసుల భారీ మోహరింపు, డ్రోన్లు, సీసీ టీవీలు వంటి భద్రతా చర్యలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. ఈ సమయంలో ప్రజల సహకారం అత్యంత అవసరం. కేవలం మద్య నిషేధమే కాదు, ఇతర నియమ నిబంధనలను కూడా గౌరవించడం మన బాధ్యత.
చివరగా.. జూలై 13, 14 తేదీలను మందుబాబులు గుర్తుంచుకోవాల్సిందే… వారు ఆధ్యాత్మికంగా మారాల్సిన రోజులు ఇవి. ప్రశాంతంగా భక్తిమయమైన జీవితంలో ఈ రెండు రోజులు వారు లీనమై జీవనం సాగించాలని అందరం ఆశిద్దాం!