Tirupati Special Trains: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) అదిరిపోయే న్యూస్ చెప్పింది. సంక్రాంతి సమయంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో జల్నా–తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగించింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా జనవరి నెలలో మరో నాలుగు అదనపు ట్రిప్పులను నడపనున్నట్లు ప్రకటించింది. దీంతో మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం నుంచి తిరుపతికి వెళ్లాలనుకునే భక్తులకు ప్రయాణం మరింత ఈజీ కానుంది.
పండుగల సమయంలో తిరుపతికి వెళ్లే భక్తుల సంఖ్య సాధారణ రోజుల కంటే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నూతన సంవత్సరం, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో రైళ్లలో టికెట్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే జల్నా–తిరుపతి ప్రత్యేక రైళ్లకు అదనపు ట్రిప్పులను ప్రకటించింది. గురువారాల్లో నడిచే జల్నా–తిరుపతి ప్రత్యేక రైలు (07814) జనవరి 7, 14 తేదీల్లో అదనపు సర్వీసులు అందించనుంది. అటు శుక్రవారాల్లో నడిచే తిరుపతి–జల్నా ప్రత్యేక రైలు (07815) జనవరి 8, 15 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రెండు రైళ్లు కలిపి మొత్తం నాలుగు అదనపు ట్రిప్పులు నడపనున్నాయి.
ప్రయాణికులకు మంచి సౌకర్యాలు కల్పించేందుకు ఈ ప్రత్యేక రైళ్లను మొత్తం 24 కోచ్‌లతో నడపనున్నారు. ఇందులో పలు తరగతులకు చెందిన బోగీలు ఉంటాయి. ఏసీ చైర్ కార్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్, జనరల్ కోచ్‌లు, జనరేటర్ కమ్ గార్డ్ కోచ్‌లు ఉంటాయి. బడ్జెట్, ప్రయాణ అవసరాలకు అనుగుణంగా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మహారాష్ట్రలోని జల్నా, మరాఠ్వాడా ప్రాంతాల నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు ఈ అదనపు రైలు సర్వీసులు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సెలవుల్లో కుటుంబ సమేతంగా తిరుమల దర్శనానికి వెళ్లాలనుకునే వారికి మరింత లాభం కలగనుంది. ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల సాధారణ రైళ్లపై రద్దీ ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంది.
అదనపు ట్రిప్పుల్లో ప్రయాణించాలనుకునే వాళ్లు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. సంక్రాంతి సమయంలో తిరుపతి వెళ్లాలని ప్లాన్ చేస్తున్న ప్రయాణికులకు ఈ అదనపు రైలు సర్వీసులు మంచి అవకాశంగా చెప్పవచ్చు.
Read Also: రైలు ప్రయాణికులకు అలర్ట్.. బెంగళూరు–అనంతపురం రైళ్ల దారి మళ్లింపు!