Bengaluru–Anantapur MEMU Trains Diverted: రైలు ప్రయాణం చేసేవారికి దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. బెంగళూరు–అనంతపురం మధ్య నడిచే రెండు MEMU రైళ్లను నవంబర్ 30న దారి మళ్లించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి స్టేషన్‌లో చేస్తున్న అభివృద్ధి పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అస్సాంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో బెంగళూరు నుంచి అగర్తల వెళ్లే హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 1న రద్దు చేశారు. దీంతో ఆయా రైళ్లలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ముందుగానే అలర్ట్ కావడం మంచిది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్‌ఎస్‌పీఎన్ (SSPN) పుట్టపర్తి రైల్వే స్టేషన్‌లో కొన్ని కీలక పనులు చేపట్టనున్నారు. ట్రాక్ మెషిన్ సైడింగ్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ప్రస్తుతం ఉన్న ట్రావెలర్స్ సైడింగ్‌ను సిగ్నల్డ్ లూప్ లైన్‌గా మార్చనున్నారు. ఈ పనుల్లో భాగంగా ఇంటర్‌లాకింగ్ వ్యవస్థకు సంబంధించిన పనులు చేపడుతున్నారు. దీంతో నవంబర్ 30న ఈ మార్గంలో నడిచే రెండు MEMU రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు.
1.KSR బెంగళూరు–అనంతపురం MEMU (రైలు నంబర్ 66559)
బెంగళూరులోని KSR స్టేషన్ నుంచి అనంతపురం వెళ్లే ఈ రైలు నవంబర్ 30న సాధారణ మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ నేపథ్యంలో నారాయణపురం, పుట్టపర్తి, బసంపల్లె స్టేషన్లలో ఆగదు. ఈ రైలు పెనుకొండ, మక్కాజిపల్లి, నాగసముద్రం, ధర్మవరం మీదుగా అనంతపురం చేరుకుంటుంది.
2.అనంతపురం–KSR బెంగళూరు MEMU (రైలు నంబర్ 66560)
అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే ఈ రైలు కూడా నవంబర్ 30న దారి మళ్లనుంది. సాధారణంగా ఆగే బసంపల్లె, పుట్టపర్తి, నారాయణపురం స్టేషన్లలో ఈ రైలుకు స్టాప్ ఉండదు. ప్రత్యామ్నాయంగా ధర్మవరం, నాగసముద్రం, మక్కాజిపల్లి, పెనుకొండ మీదుగా బెంగళూరుకు చేరుకుంటుంది.
ఈ నేపథ్యంలో ఆయా స్టేషన్లలో ఎక్కాల్సిన, దిగాల్సిన ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
మరోవైపు బెంగళూరు నుంచి ఈశాన్య భారతంలోని అగర్తాల వెళ్లే ప్రయాణికులకు కూడా రైల్వే శాఖ కీలక సమాచారం ఇచ్చింది. రైలు నంబర్ 12503, SMVT బెంగళూరు–అగర్తాల హంసఫర్ ఎక్స్ ప్రెస్‌ను డిసెంబర్ 1న రద్దు చేశారు. అస్సాంలోని లుమ్‌డింగ్ డివిజన్ పరిధిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. లుమ్ డింగ్–బాదర్ పూర్ మధ్య ఉన్న ఎలక్ట్రిఫైడ్ సింగిల్ లైన్ కొండ ప్రాంతంలో బందర్‌ఖాల్, దామ్‌చార స్టేషన్ల మధ్య ఆయిల్ ట్యాంకర్లను తీసుకెళ్తున్న IOCL గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
గూడ్స్ రైలు ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు పుట్టపర్తి స్టేషన్‌లో పనుల కారణంగా MEMU రైళ్ల మార్గాల్లో మార్పులు చేశారు. సో, నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో ప్రయాణించే వారు, రైల్వే అధికారిక వెబ్‌సైట్ లేదంటే NTES యాప్‌లో తాజా సమాచారం తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
Read Also: విమానాలు ల్యాండ్ అవుతుండగా ‘గో అరౌండ్’ ఆర్డర్స్.. ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది?