Aakash Chopra On Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును బాల్ టాంపరింగ్ వ్యవహారం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఆత్మకథలో 2018 బాల్ టాంపరింగ్ గురించి ప్రస్తావించి..ఉస్మాన్ ఖవాజా పెద్ద చిచ్చుపెట్టాడు. నాథన్ లైయన్ కూడా మింట్ క్యాండీలు ద్వారా బాల్ టాంపరింగ్ చేసినట్టు కూడా అతడు ఆరోపణలు చేశాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బాల్ టాంపరింగ్ వ్యవహారం గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాల్ టాంపరింగ్ వ్యవహారంలో టీమిండియాకు సంబంధించిన ఆటగాళ్లు ఎవరు కూడా ఇప్పటి వరకు ఇన్వాల్వ్ కాలేదని వ్యాఖ్యానించాడు. కానీ పాకిస్తాన్ ప్లేయర్లకు బాల్ టాంపరింగ్ చేయడం అలవాటుగా మారిందని బాంబు పేల్చాడు.
గతంలో టెస్టుల్లోనే కాకుండా వన్డే క్రికెట్ లో కూడా బాల్ టాంపరింగ్ కు పాకిస్తాన్ క్రికెటర్లు పాల్పడ్డారని ఆకాశ్ చోప్రా ఆరోపణలు చేశాడు. షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది లాంటి వాళ్లు ఇందులో నిందితులేనని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన బూట్లతో కూడా షోయబ్ అక్తర్ బంతి ఆకారం మార్చేందుకు చాలా సార్లు కుట్రలు చేశాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. షాహిద్ అఫ్రిది బంతిని కొరికి అడ్డంగా దొరికాడని బాంబు పేల్చాడు.
పాకిస్తాన్ లో జరిగే పీఎస్ఎల్ టోర్నమెంట్ లో కూడా బాల్ టాంపరింగ్ చేసిన వెధవలు ఉన్నారని హాట్ కామెంట్ చేశాడు. ఇలాంటి వాళ్లు ఇండియా గురించి చాలా బరితెగించి మాట్లాడతారని ఫైర్ అయ్యాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా మొదటి నుంచి టాంపరింగ్ చేస్తున్నారని.. ఈ విషయం అందరికీ తెలుసు అన్నారు. కానీ ఉస్మాన్ ఖవాజా ఆత్మకథలో రాయడంతో అందరూ బయటకు వచ్చి ఆస్ట్రేలియాను విమర్శిస్తున్నారని చెప్పుకొచ్చాడు.
ఉస్మాన్ ఖవాజా బాల్ టాంపరింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో షోయబ్ అక్తర్ (Shoaib Akthar ) ఇటీవల స్పందించాడు. తమ క్రికెటర్లు కూడా బాల్ టాంపరింగ్ చేస్తాడని ఒప్పుకున్నాడు. గతంలో బాటిల్ మూతలతో కూడా టాంపరింగ్ చేసామని వ్యాఖ్యానించాడు. బంతి దొరకగానే బాటిల్ మూతతో ఆకారం మార్చేందుకు చాలా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయినట్టు తెలిపాడు. ఇప్పటికీ టెస్టు క్రికెట్ లో బాల్ టాంపరింగ్ వ్యవహారం నడుస్తోందని బాంబ్ పేల్చాడు.