Indian Railways: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ మహా కుంభమేళా వేడుకల కోసం ముస్తాబవుతోంది. జనవరి మూడో వారంలో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ సర్కారు అద్భుతమైన ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మహా కుంభమేళాకు భారీగా బడ్జెట్ కేటాయించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. దేశ నలు మూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారతీయ రైల్వే సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచుతుంది. మహా కుంభమేళా వేడుకల కోసం ఏకంగా 13 వేళ రైళ్లను షెడ్యూల్ చేయబోతున్నది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ రైళ్లు ప్రయాగరాజ్ కు చేరుకోనున్నాయి.
ఏపీలో పలు సాధారణ రైళ్లు రద్దు
ఇక మహా కుంభమేళా నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వేడుకల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచేందుకు పలు సాధారణ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి మార్చి 1 వరకు పలు సాధారణ రైళ్లను క్యాన్సిల్ చేయనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా తిరుపతి నుంచి పలు రూట్లలో నడిచే రైళ్లను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
ఏ రైళ్లు రద్దు అయ్యాయంటే?
ముఖ్యంగా ఏపీలో నడిచే పలు రైళ్లను క్యాన్సిల్ చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి-కదరిదేవరపల్లి ప్యాసింజర్, గుంతకల్-తిరుపతి ప్యాసింజర్ లాంటి రైళ్లను రెండు నెలల పాటు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వాళ్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని సూచించారు. అటు తిరుపతి- హుబ్లీ రూట్ లో నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ను కూడా రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మహా కుంభమేళా వేడుకలు పూర్తయ్యే వరకు ఈ రద్దు కొనసాగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్లలో ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు ఎవరైనా ఉంటే వారికి రీఫండ్ అందిస్తామని వెల్లడించారు.
ధర్మవరం రూట్ లో నడిచే 6 రైళ్లు రద్దు
అటు తిరుపతి-కడప మీదుగా ధర్మవరం సెక్షన్ లో నడిచే మరో 6 సాధారణ రైళ్లను కూడా క్యాన్సిల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నిజానికి ఈ మార్గంలో నిత్యం పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తున్నది. రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్న ప్రయాణీకులు
రైల్వే అధికారులు 2 నెలల పాటు పలు రైళ్లు క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో.. పలువురు ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. బస్సులతో పాటు ఇతర ప్రైవేట్ వాహనాలపై ఆధారప పడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, రైలు ప్రయాణంతో పోల్చితే ఎక్కువ ఖర్చు కావడంతో పాటు, చాలా సమయం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: సంక్రాంతి వేళ ప్రయాణీకులకు గుడ్ న్యూస్, జనవరి నుంచి ఆ రైళ్లకు అదనపు కోచ్‌లు!