TTD News for Telangana: తెలంగాణ ప్రజలకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఇటీవల తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలు వినిపించాయి. అలాగే మంత్రి కొండా సురేఖ సైతం ఇదే విషయంపై శ్రీశైలంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుతో టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు భేటీ అయ్యారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ నుండి సైతం భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అయితే ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలతో వచ్చే భక్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుమలకు సంబంధించిన పలు అంశాలపై వారిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ సాగింది. తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా ప్రత్యేక దృష్టిసారించాలని సీఎం సూచించారు.
Also Read: Tirumala Updates: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం.. ఈ తేదీలు గుర్తుంచుకోవాల్సిందే!
ఇక తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై సైతం వీరిద్దరి మధ్య చర్చ సాగింది. వారానికి 4 సిఫార్సు లేఖలకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. వారానికి రెండు బ్రేక్ దర్శనాలతో పాటు, రెండు రూ. 300 దర్శనం లేఖలకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ విధానం అమలైతే, తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు తిరుమలలో అత్యంత ప్రాధాన్యత లభిస్తుందని చెప్పవచ్చు. కాగా ఇటీవల తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులేఖలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు వదంతులు వ్యాపించిన నేపథ్యంలో ఈవో శ్యామల రావు స్వయంగా ఖండించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు భేటీ కావడంతో మరోమారు ఈ అంశం తెర మీదికి వచ్చింది.