South Central Railway: ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా రూట్లలో నడిచే రైళ్ల విషయంలో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వెయిట్ లిస్ట్ పెరుగుతున్న రైళ్లలో తాత్కాలికంగా అదనపు కోచ్ ల సంఖ్యను పెంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణీకులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి పీక్ ట్రావెల్ సీజన్లలో అదనపు కోచ్ లు పెంచడం వల్ల ప్రయాణీకులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. ఈ కోచ్ ల పెంపు జనవరి ప్రారంభం నుంచి అమల్లోకి రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నిర్దిష్ట రైళ్లు వాటి కోచ్ కాన్ఫిగరేషన్లకు అనుగుణంగా అదనపను కోచ్ లు యాడ్ చేయనున్నారు.
అదనపు కోచ్ లు ఏర్పాటు చేసే రైళ్లు ఇవే!
అదనపు కోచ్ లు ఏర్పాటు చేయాల్సిన రైళ్లను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ముఖ్యంగా అధిక రద్దీ ఉన్న హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-జైపూర్ రూట్లు తొలుత అదనపు కోచ్ లను యాడ్ చేయనున్నారు. జనవరి 2 నుంచి హైదరాబాద్-ముంబై CSMT-హైదరాబాద్(22731/22732), హైదరాబాద్-ముంబై CSMT-హైదరాబాద్(12702/12701) రైళ్లలో రెండు జనరల్ సెకండ్-క్లాస్ కోచ్ లను, స్లీపర్ కోచ్ లను యాడ్ చేయనున్నారు. ఈ నిర్ణయంతో ప్రయాణీకులకు అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అటు హైదరాబాద్-జైపూర్(12720/12719) రైల్లోనూ జనవరి 3 నుంచి అదనపు కోచ్ లు అందుబాటులోకి రానున్నాయి. ఈ బోగీల పెంపు తర్వాత, ఇతర రైళ్లలోనూ అదనపు కోచ్ లను పెంచే అవకాశాన్ని పరిశీలించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
వెయిటింగ్ లిస్టు సమస్యలు తగ్గే అవకాశం
సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తీసుకున్న కోచ్ ల పెంపు నిర్ణయం ప్రయాణీకులకు వెయిట్ లిస్ట్ సమస్యలను తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా సెలవులు, పండుగలు, వీకెండ్ లో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణ ఇబ్బందులు తగ్గుతాయి. ప్రయాణీకులు సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, అదనపు స్లీపర్, AC కోచ్‌లు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించనున్నాయి.
Read Also: ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా? రీఫండ్ రూల్స్ గురించి తెలుసుకోండి..
అదనపు కోచ్ ల ఏర్పాటుపై ప్రయాణీకుల సంతోషం
సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న బోగీల పెంపు నిర్ణయం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై సీట్లు దొరక్క ఇబ్బంది పడే అవకాశం తగ్గుతుందంటున్నారు. ఇక ఈ నిర్ణయం జనవరి తొలివారంలో అమలు కానున్న నేపథ్యంలో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పే అవకాశం ఉందంటున్నారు. పండుగ వేళ మంచి నిర్ణయం తీసుకున్న రైల్వే అధికారులకు కృతజ్ఞతలు చెప్తున్నారు.
ఇతర రూట్లలోనూ అదనపు బోగీలు పెంచాలంటున్న ప్రయాణీకులు
మరోవైపు సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం మాదిరిగానే ఇతర ప్రాంతాల్లో అధిక రద్దీ ఉన్న రూట్లలోనూ అదనపు కోచ్ లు పెంచే ప్రయత్నం చేయాలని రైల్వే అధికారులను కోరుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవం కలుగుతుందంటున్నారు. అదే సమయంలో రైల్వే ఖర్చు తగ్గి ఆదాయం సమకూరుతుందంటున్నారు.