Indian Railways: ఇక రైల్వే ప్రయాణీకులకు టికెట్ల కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. అయితే, అన్ని రైళ్లలో కాదు. కేవలం నమో భారత్ రైలు ప్రయాణీకులకు మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉంటుంది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్(NCMC) ఉపయోగించి 10% తగ్గింపు పొందవచ్చని నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(NCRTC) వెల్లడించింది. తాజాగా ఈ సంస్థ క్యాష్ లెస్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు NCMC కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు, డిజిటల్ టికెట్ కొనుగోలు చేసే ప్రయాణీకులకు బహుమతులు కూడా ఇస్తుంది.
నమో భారత్ ప్రయాణీకులకు గిఫ్ట్ లు ఎలా ఇస్తారంటే?
ఢిల్లీ పరిధిలోని నమో భారత్ రవాణా వ్యవస్థ అంతటా పేపర్ లెస్ టికెటింగ్ ను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా డిస్కౌంట్ ను ప్రకటించింది NCRTC. డిజిటల్ చెల్లింపులను పెంపొందించేందుకు లక్ష్యంతో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణీకులు NCMC కార్డుతో టికెట్లు కొనుగోలు చేసేటప్పుడు ఖర్చు చేసే రూపాయికి ఒక లాయల్టీ పాయింట్ ను అందిస్తుంది. ఈ పాయింట్లు వినియోగదారుల అకౌంట్ లోకి జమ అవుతాయి. ప్రతి పాయింట్ విలువ 10 పైసలుగా పరిగణిస్తారు. టికెట్ పై 100 ఖర్చు చేయడం వల్ల 100 పాయింట్లు వస్తాయి. 100 పాయింట్ల విలువ రూ.10కి సమానం అవుతుంది. ప్రయాణికులు స్టేషన్ టికెట్ కౌంటర్లలో తమ పాయింట్లను రీడీమ్ చేసుకోవచ్చు.
నమో భారత్ రైళ్ల యాప్ లో మరిన్ని ఆఫర్లు
అటు NCMC కార్డ్ తో పాటు నమో భారత్ మొబైల్ అప్లికేషన్ ద్వారా డిజిటల్ టికెట్ కొనుగోళ్లకు 10% తగ్గింపు అందిస్తున్నది. ఈ విధానం పేపర్ లెస్ టికెటింగ్ కు మద్దతు ఇస్తుంది. ప్రతి ప్రయాణం ద్వారా టికెట్ పై నేరుగా డిస్కౌంట్ లభించడంతో పాటు లాయల్టీ పాయింట్లు కూడా లభిస్తున్నాయి. రెండు రకాలుగా లభిపొందే అవకాశం ఉంటుంది.
యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే రూ. 50 బోనస్
నమో భారత్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకునే కొత్త వినియోగదారులకు సూపర్ ఆఫర్ ఇస్తున్నారు. రూ. 50 విలువైన బోనస్ ను అందుకుంటారు. యాప్ డౌన్ లోడ్ కాగానే 500 పాయింట్లు వస్తాయి. రూ. 50 విలువ చేసే ఈ పాయింట్లను వెంటనే రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తొలిసారి ప్రయాణం చేసే వారికి ఈ పాయింట్లు ఉపయోగపడనున్నాయి. అటు NCRTC రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా లబ్ది చేకూర్చుతున్నది. ఈ ప్రోగ్రామ్ ద్వారా రిఫరర్లతో పాటు కొత్త వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతి ఒక్కరూ రిఫెరల్ పై 500 లాయల్టీ పాయింట్లు పొందే అవకాశం ఉంటుంది.
ఏడాది వరకు లాయల్టీ పాయింట్లు
లాయల్టీ పాయింట్లు ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్లు తరచుగా యాప్ ను ఉపయోగించేలా చేస్తాయి. నమో భారత్ యాప్ Google Play Storeతో పాటు Apple App Store రెండింటిలోనూ అందుబాటులో ఉన్నాయి.
Read Also: కిలో మీటర్ రైల్వే లైన్ నిర్మాణానికి అంత ఖర్చు అవుతుందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!