TTD Token Counters: తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు టిటిడి తాజా మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు శ్రీవారి మెట్టు వద్ద నుండి అందుతున్న దివ్య దర్శనం టోకెన్లను, భక్తుల రద్దీ, భద్రత పరంగా తాత్కాలికంగా మరో చోటికి మార్చేందుకు టిటిడి నిర్ణయం తీసుకుంది. దీంతో శ్రీవారి మెట్టు వద్ద టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌కు మార్చనున్నారు. ఈ మేరకు ఈవో జె. శ్యామలరావు, టిటిడి ఉన్నతాధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు.
ఈ మార్పు శుక్రవారం (జూన్ 6) సాయంత్రం నుంచే అమల్లోకి రానుంది. భక్తులు ఆధార్ కార్డు ఆధారంగా ఈ టోకెన్లను పొందవచ్చు. అయితే టోకెన్లు ముందు వచ్చిన వారికి ముందు అన్న ప్రాతిపదికన మాత్రమే ఇవ్వబడతాయి. టోకెన్ పొందిన భక్తులు తిరుమల పాదయాత్రలో 1200వ మెట్టు వద్ద తమ టోకెన్లను స్కాన్ చేయాల్సి ఉంటుంది. తద్వారా భక్తుల తరలింపు, ట్రాకింగ్ సులభతరంగా చేయాలన్నదే టిటిడి ఉద్దేశం.
ఈ క్రమంలో శనివారం శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం సాయంత్రమే దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్‌లో ఎస్‌ఎస్‌డి (SSD) టోకెన్ల కోసం కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు గందరగోళం కలగకుండా స్పష్టమైన విభజన, సూచనలు, గైడ్‌లైన్లు అమలు చేయాలని అధికారులకి ఈవో ఆదేశించారు.
ఈ టోకెన్ల జారీ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించాలని నిర్ణయించారు. భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ కౌంటర్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే విధంగా పర్యవేక్షణను నిర్వహించనున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత పరంగా విజిలెన్స్ మరియు జిల్లా పోలీస్ శాఖతో సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని టిటిడి ఈవో స్పష్టం చేశారు.
Also Read: AP Weather update: ఏపీ ప్రజలకు అలర్ట్.. మరికొద్ది గంటల్లో దంచుడే..
అలిపిరి వద్ద ఏర్పాటవుతున్న ఈ తాత్కాలిక కౌంటర్ల గురించి విస్తృత ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తులకి ముందుగానే సమాచారం అందేలా బోర్డులు, ప్రకటనలు, డిజిటల్ డిస్‌ప్లేలు ఏర్పాటు చేయాలని సూచించారు. పాదయాత్ర భక్తులకు సులభంగా టోకెన్లు పొందేలా పటిష్టమైన క్యూలైన్లు, సమర్థవంతమైన కౌంటర్ల ఏర్పాటుకు ఇంజినీరింగ్ శాఖను మొగ్గుచూపించారు.
భక్తుల శ్రేయస్సు దృష్ట్యా అన్నప్రసాదాల పంపిణీ, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. శ్రీవారి సేవకుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జెఈవో వీరబ్రహ్మం, ఇన్‌చార్జి సీవీఎస్‌ఓ, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సీఈ సత్యనారాయణ, ఇంజినీరింగ్ ఎస్ఈలు, ట్రాన్స్‌పోర్ట్ జీఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవోలు తదితర అధికారులు పాల్గొన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో ఈ తరహా మార్పులు తాత్కాలికంగా అనుసరించడం ద్వారా నిఖార్సైన భక్తి పర్యాటనకు అవకాశం కల్పించవచ్చని టిటిడి అభిప్రాయపడుతోంది.
ఈ మార్పులతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని విభాగాలు సమిష్టిగా కృషి చేయాలని ఈవో స్పష్టం చేశారు. టోకెన్ల ముద్రణ నుంచి స్కానింగ్ వరకూ ప్రతి దశను భద్రతతో, పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. అటు భక్తుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను సైతం పరిగణనలోకి తీసుకొని మరింత మెరుగుదలలు చేయాలని తెలిపారు.
ఇక భక్తులు శ్రీవారి మెట్టు వద్ద కాకుండా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు పొందాల్సి ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. దర్శనానికి ముందు గడువు చూసుకొని ముందుగానే టోకెన్లు పొందేందుకు ఏర్పాట్లలో భాగంగా ఇది పెద్దగా ఉపశమనం కలిగించనుంది. టిటిడి ఈ చర్య భక్తులకు గమ్యస్థానానికి సమర్థవంతంగా చేరుకునే దారిని చూపిస్తుందని స్పష్టం చేసింది.