TTD-LIC Insurance Scheme: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించే భక్తుల కుటుంబాలకు అందించే బీమా మొత్తాన్ని భారీగా పెంచింది. ఇప్పటివరకు ఉన్న రూ.3 లక్షల బీమాను ఏకంగా రూ.10 లక్షలకు పెంచాలని పాలకమండలి నిర్ణయించింది. దీంతో అనుకోని ప్రమాదాల్లో భక్తులను కోల్పోయే కుటుంబాలకు కొంత ఆర్థిక భరోసా లభించనుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. భక్తుల భద్రతతో పాటు, ప్రమాద సమయంలో వారి కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో బీమా కవరేజీని పెంచినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
టీటీడీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో సహజంగా మరణించే భక్తుల కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. సాధారణ మరణానికి తొలిసారిగా రూ.2 లక్షల బీమా కవరేజీని అందించనుంది. అంతేకాకుండా, సహజ మరణం సంభవించిన కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం కూడా అందించేలా చర్యలు తీసుకోనుంది. దీంతో ప్రమాదవశాత్తు మరణించే వారితో పాటు సహజ మరణం పొందే భక్తుల కుటుంబాలకు కూడా టీటీడీ నుంచి సహాయం అందనుంది.
ఈ బీమా పథకాన్ని భారత జీవిత బీమా సంస్థ (LIC)తో కలిసి అమలు చేయనున్నారు. ఇందుకోసం టీటీడీ రూ.2.12 కోట్లను LICకి చెల్లించనుంది. దేశంలోనే తొలిసారిగా భక్తుల కోసం టీటీడీ ప్రత్యేకంగా గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తోందని టీటీడీ ఈవో రవిచంద్ర వెల్లడించారు. తిరుమలకు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఇలాంటి బీమా సదుపాయం ఉండటం అనుకోని ఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబాలకు ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ బీమా పథకం కొన్ని ప్రత్యేక వర్గాలకే పరిమితం కాకుండా వివిధ రకాల దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు వర్తించనుంది. SSD టోకెన్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ ఉన్న భక్తులతో పాటు ఎలాంటి వివరాలు లేకుండా సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు కూడా బీమా కవరేజీ ఉంటుంది. అంతేకాదు, అలిపిరి దగ్గర టోకెన్ తీసుకోకుండా క్యూలో ఉన్న భక్తులకు కూడా ఈ బీమా వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. అంటే, తిరుమలలో దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య, వారు తీసుకున్న టికెట్, టోకెన్ ఆధారంగా మాత్రమే కాకుండా విస్తృతంగా కవరేజీ కల్పించనున్నారు.
టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో తిరుమల యాత్రలో అనుకోని ఘటనలు ఎదురైతే బాధిత కుటుంబాలకు గతంలో కంటే ఎక్కువ ఆర్థిక సహాయం అందనుంది. భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం త్వరలో అమల్లోకి రానుంది.
Read Also: హోస్టెస్, వైఫై, టాయిలెట్.. ఈ ఆర్టీసీ బస్సును చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!