NHAI new toll rates: జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరికీ ఇది గుడ్ న్యూస్. పెద్ద ఫ్లైఓవర్, బ్రిడ్జిలు, ఎలివేటెడ్ రోడ్లు ఉన్న చోట్ల పోయినంత మాత్రాన టోల్ గేట్ల వద్ద చాలా డబ్బులు కట్టాల్సి వస్తోంది. చిన్న దూరం అయినా సరే, పూర్తి ఛార్జ్ తీసుకుంటున్నారు అన్న అనేక ఫిర్యాదులు దేశవ్యాప్తంగా వినిపించాయి. అలా కాకుండా, వాడినంతకు మాత్రమే చెల్లించాలన్న ప్రజల డిమాండ్‌కి కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
తాజాగా తీసుకున్న కీలక నిర్ణయంతో, ఇకపై జాతీయ రహదారుల్లో బ్రిడ్జిలు, టన్నెల్స్, ఎలివేటెడ్ రోడ్లు ఉన్న చోట్ల టోల్ రేట్లు గరిష్టంగా 50 శాతం వరకు తగ్గించనున్నారు. అంటే మీరు ప్రయాణించే దూరం, వాడే నిర్మాణం మేరకే డబ్బు చెల్లిస్తారు. ఇది సాధారణ ప్రయాణికులకు మాత్రమే కాదు, వాణిజ్య వాహనాలకూ బాగా ఉపశమనం కలిగించనుంది.
ఈ నిర్ణయం వల్ల టోల్ ఫీజు తగ్గించాల్సిన ప్రాజెక్టుల వివరాలను ఇప్పటికే NHAI (National Highways Authority of India) అధికారులకు పంపింది. కొత్తగా నిర్మించబోయే ప్రాజెక్టుల్లోనూ, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటిలోనూ ఈ మార్గదర్శకాలు అమలవుతాయి. ముఖ్యంగా ఎలివేటెడ్ రోడ్లు అనేవి కొంతమంది ప్రయాణికులు తప్పనిసరిగా వాడాల్సిన స్థితిలో ఉండడంతో, టోల్ ఛార్జీలు అన్యాయంగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది.
ఈ విధానం అమలవ్వడం వల్ల, టోల్ గేట్ల వద్ద వాహనదారులు ఎదుర్కొంటున్న అసంతృప్తి తగ్గుతుంది. అలాగే ప్రజల వద్ద నుండి వచ్చిన అభ్యంతరాలకు ప్రభుత్వం న్యాయమైన పరిష్కారం చూపినట్టైంది. ఇకపోతే ఇది ఫలితంగా రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది, దీని ప్రభావం సరుకు ధరలపైనా పడే అవకాశం ఉంది. పంటలు, వస్తువులు, రవాణా అయ్యే సరుకులు ఇవన్నీ కూడా తక్కువ ఖర్చుతో చేరేలా మారవచ్చు.
Also Read: Lion attack viral video: పెంట చేసిన పెంపుడు సింహం.. సిటీ నడిబొడ్డులో జనాలపై దాడి
మరోవైపు, టోల్ ఛార్జీలపై పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక డిజిటల్ సదుపాయాలు తీసుకువచ్చేందుకు కూడా సిద్ధమవుతోంది. FASTag వాడకాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రతి ప్రాంతంలో టోల్ గేట్లు ఎక్కడున్నాయి, ఏదే దూరానికి ఎంత టోల్ వసూలు అవుతుంది అన్న సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపొందిస్తున్నారు.
ఇప్పటికే వాహనదారులు ఈ మార్పును స్వాగతిస్తున్నారు. మా ప్రాంతంలో చిన్న బ్రిడ్జి ఉన్నందుకే రూ. 90 టోల్ అడుగుతున్నారు. ఇప్పుడు అయినా మన వాడకం మేరకే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మంచి చర్య అంటూ డ్రైవర్లు, లారీ యజమానులు అభిప్రాయపడుతున్నారు.
తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది మంచి పరిష్కారం. పర్యాటకులు, ఉద్యోగులకు ఇది నిజంగా ఉపశమనం. ఇక మీదట ఒక్కో బ్రిడ్జి దాటినా, గుండెల్లో గుబులు అనిపించకపోవచ్చు! ఇకపై ప్రయాణం ఎంత దూరమో, టోల్ ఫీజూ అంతే! మీరు వాడినదానికి మాత్రమే చెల్లించండి. సరైన మార్గదర్శకాలతో.. సరళమైన ప్రయాణానికి ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన సానుకూల సంకేతం.