WhatsApp Governance: శీశైలం, కాణిపాకం, సింహాచలం, విజయవాడ, అన్నవరం, ద్వారాకా తిరుమల, శ్రీ కాళహస్తి సహా ఏపీలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. నిత్యం ఈ ఆలయాలను సందర్శించుకునేందుకు ఏపీ నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఆయా ఆలయాల్లో త్వరగా దర్శనం చేసుకునేందుకు టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. కొంత మంది ఆలయ ప్రాంగణంలోనే టికెట్లు బుక్ చేసుకుంటే, మరికొంత మంది ఆన్ లైన్ సెంటర్స్ ద్వారా బుక్ చేసుకుంటారు. కానీ, ఇప్పుడు ఇంట్లో నుంచి సింపుల్ గా దర్శనం టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఏపీ సర్కారు. ఒకే ఒక్క వాట్సాప్ క్లిక్ తో రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు సంబంధించిన సేవలను పొందేలా చేస్తోంది. ఇంతకీ వాటిని ఎలా పొందాలంటే..
వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన ఏపీ సర్కారు
ఏపీ ప్రభుత్వం ‘మన మిత్ర – ప్రజల చేతిలో ప్రభుత్వం’ పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా 161 రకాల ప్రభుత్వం సేవలను అందిస్తోంది. వీటిని ఉపయోగించేందుకు 9552300009 మొబైల్ నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ కు ‘హాయ్’ అని మెసేజ్ పెట్టాలి. ‘మన మిత్ర – ప్రజల చేతిలో ప్రభుత్వం’ సేవలకు స్వాగతం అంటూ లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే.. రెవెన్యూ, మున్సిపల్, ఎండోమెంట్ సేవలను వాట్సాప్ లో పొందే అవకాశం ఉంటుంది.
ఒకే క్లిక్ తో దేవాలయాల సేవలు
ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా టీటీడీ మినహా మిగతా అన్ని సేవలను అందిస్తారు. ముందుగా వాట్సాప్ సేవల వివరాలు ఓపెన్ కాగానే అందులో దేవాదాయ బుకింగ్ సేవలను సెలెక్ట్ చేసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు(శీశైలం, కాణిపాకం, సింహాచలం, విజయవాడ, అన్నవరం, ద్వారకా తిరుమల, శ్రీకాహస్తి) అక్కడ కనిపిస్తాయి. మీరు ఏ ఆలయాన్ని దర్శించాలి అనుకుంటున్నారో, దాని మీద క్లిక్ చేయాలి. వ్యక్తిగత దర్శనం, దేవాలయ సేవ, దేవాలయ దానాలు అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు కావాల్సిన ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆయా సేవలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. మీకు కావాల్సిన సేవకు సంబంధించిన వివరాలు డిస్ ప్లే అవుతాయి. ముఖ్యంగా ఇంటి దగ్గరి నుంచే దర్శనం టికెట్లు, వసతి సేవలను బుక్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారానే చెల్లింపులు చెయ్యొచ్చు. నచ్చిన స్లాట్ బుక్ చేసుకుని, ప్రశాంతంగా, త్వరగా దర్శనం చేసుకోవచ్చు.
టీటీడీ సేవలు ఉండవు!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ సేవల్లో టీటీడీ సేవలు మాత్రం అందుబాటులో లేవు. ఎందుకంటే, టీటీడీ అనేది అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలల్లో భక్తులు వస్తారు. ఆ ఆలయ సేవలు అన్నీ టీటీడీ బోర్డు చూసుకుంటుంది. దర్శనం టికెట్లు మొదలుకొని, వసతి వరకు అన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ గవర్నెన్స్ లో టీటీడీ మినహా అన్ని దేవాలయాల సేవలను అందుబాటులో ఉంచారు. సో, ఇకపై మీరు కూడా తిరుమల మినహా ఏపీలోని అన్ని ఆలయాల సేవలను ఇంట్లో నుంచే పొందండి.
Read Also: ఈ ఆలయాలకు పొరపాటున కూడా వెళ్లకండి, కాదూ కూడదని వెళ్లారో…