బెంగళూరు టు చెన్నై – వందే భారత్ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ.2180
వైజాగ్ టు సికింద్రాబాద్ గరిష్ట టికెట్ ధర రూ.3170
భారతీయ రైళ్లలో గరిష్ట టికెట్ రేట్లు ఉండేది వందే భారత్ సర్వీస్ ల లోనే. అదే సమయంలో గరిష్టంగా సౌకర్యాలు ఉండేది కూడా అదే రైళ్లలో. అయితే వీటిని మధ్య తరగతి ప్రజలకు కూడా దగ్గర చేసేందుకు ఇప్పుడు రైల్వే కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే సామాన్యులకు కూడా వందే భారత్ ప్రయాణం సాధ్యపడుతుంది.
టికెట్ రేట్లపై కీలక నిర్ణయం..
వందే భారత్ ట్రైన్ సిరీస్ ని ఏ ముహూర్తంలో ప్రవేశ పెట్టారో కానీ.. సూపర్ సక్సెస్ అయ్యాయి.మొదట్లో వందే భారత్ రైళ్ల కింద ఆవులు పడ్డాయని, బర్రెల గుంపు అడ్డం వచ్చి ట్రైన్ ఆగిపోయిందని.. ఇలా రకరకాల కథనాలు ప్రచారంలో ఉండేవి. కానీ రాను రాను వందే భారత్ అంత సుఖ ప్రయాణం ఇంకోటి లేదని తేలిపోయింది. టికెట్ రేటు కాస్త ఎక్కువైనా వందే భారత్ లో సీటు దొరికితే ప్రయాణం సాఫీగా సాగిపోతుందనే మాట వినపడుతోంది. అయితే ఇప్పటి వరకు వందే భారత్ ట్రైన్లకు సామాన్యులు కాస్త దూరంగానే ఉంటున్నారు. వందే భారత్ ప్రయాణం ఖరీదుతో కూడుకున్నదనే ప్రచారం జరుగుతున్న సమయంలో సామాన్యులు తమకు తామే వాటికి దూరమయ్యారు. కానీ రైల్వే శాఖ త్వరలో వందేభారత్ టికెట్ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోబోతోంది.
పార్లమెంట్ లో ప్రస్తావన..
ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్ వందే భారత్ ట్రైన్ చార్జీల గురించి ప్రస్తావించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఛార్జీల తగ్గింపు గురించి అడిగారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తోందని చెప్పారు. రైల్వే మంత్రి వ్యాఖ్యలు త్వరలో వందే భారత్ చార్జీల తగ్గింపు నిర్ణయాన్ని బలపరిచేలా ఉన్నాయి.
ఖర్చు ఇలా..!
వందే భారత్ రైలు చార్జీలు ఎక్కువే. అదే సమయంలో ఆ ట్రైన్ల నిర్వహణ కూడా రైల్వే శాఖకు తలకు మించిన భారం. 1,000 నుంచి 1,500 కిలోమీటర్ల రౌండ్-ట్రిప్ సర్వీస్ నడిపేందుకు రోజుకు రూ.5 లక్షలనుంచి రూ.8 లక్షల వరకు ఉంటుంది. ఇందులో ఇంధన ఖర్చులు 2 నుంచి 3 లక్షల రూపాయలు కాగా, నిర్వహణ ఖర్చు లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు ఉంటుంది. సిబ్బంది జీతాలకు గరిష్టంగా లక్ష రూపాయలు తీసేసినా.. క్యాటరింగ్, క్లీనింగ్, ఇతర సేవలకు అదనపు ఖర్చులు ఉంటాయి. వీటన్నిటిని కలుపుకొంటే.. వందే భారత్ చార్జీలు అంత భారమేం కాదని అధికారులు అంటున్నారు. అయితే ధరలు మరింత తగ్గిస్తే సామాన్యులు మరింతగా వందే భారత్ ని ఆదరిస్తారు.
సౌకర్యాలలో టాప్..
ప్రస్తుతం భారత్ లోని రైళ్లలో వందే భారత్ లోనే అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆటోమేటిక్ డోర్లు, రిక్లైనింగ్ సీట్లు, ఆన్‌బోర్డ్ వై-ఫై, బయో-వాక్యూమ్ టాయిలెట్ సౌకర్యాలు ఇందులో ఉంటాయి. గంటకు 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఇవి పరుగులు తీస్తాయి. వందే భారత్ ని భారత రైల్వే వ్యవస్థలో ఒక గొప్ప ముందడుగుగా చెప్పవచ్చు.
వందే భారత్ సిరీస్ ని సెమీ హైస్పీడ్ రైళ్లుగా వ్యవహరిస్తారు. 2019లో వీటిని ప్రారంభించి ఏడాదికేడాది సర్వీసుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి, 136 వందే భారత్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి పైగానే ఉంది. అంటే వీటికి ప్రజాదరణ ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికీ ఉన్నతాదాయ వర్గాలే వందేభారత్ ని ఆశ్రయిస్తున్నాయి. సామాన్యులు వాటికి దూరంగానే ఉంటున్నారు. మిగతా రైళ్లలో టికెట్లు దొరకనప్పుడే చాలామంది వందే భారత్ ని ఆశ్రయిస్తున్నారు. టికెట్ ధర తగ్గిస్తే మాత్రం సామాన్యుల ఆదరణతో వందే భారత్ సిరీస్ మరింత సూపర్ సక్సెస్ అవుతుంది.