Operation Amanat: భారతీయ రైల్వేస్ ద్వారా నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. తక్కువ ఖర్చు, సౌకర్యవంతంగా ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో చాలా మంది రైలు ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. రైలు ప్రయాణ సమయంలో కొంత మంది తమ లగేజీని రైల్లోనే మర్చిపోయి దిగిపోతుంటారు. రైలు దిగాక తమ లగేజీ లేదని తెలిసి కంగారు పడుతుంటారు. అలాంటి సమయంలో ప్రయాణీకులు ఏం చేయాలంటే..
‘అపరేషన్ అమనత్’ను అందుబాటులోకి తెచ్చిన వెస్ట్రన్ రైల్వేస్
రైళ్లలో లగేజీని పోగొట్టుకున్న ప్రయాణీకుల కోసం వెస్ట్రన్ రైల్వేస్ సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని పేరు ‘ఆపరేషన్ అమనత్’. ఈ సర్వీసులో భాగంగా రైల్వే పోలీసులు రైల్లో మర్చిపోయిన లగేజీ అంతటినీ ఒక రూమ్ లో సేఫ్ గా పెడతారు. ఆ వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని www.indianrailways.gov.in వెబ్ సైట్ లో పొందుపర్చుతారు. అంతేకాదు, ఆ సామానుకు సంబంధించిన ఫోటోలతో సహా వివరాలను అందుబాటులో ఉంచుతారు. వెస్ట్రన్ రైల్వేల పరిధిలోని రైళ్లలో సామాన్లు పోగొట్టుకున్నవారు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి. వాటిలో మన లగేజీ ఉంటే, వెంటనే మన ఫ్రూప్ చూపించి తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సేవ వెస్ట్రన్ రైల్వేస్ పరిధిలోనే ఉంది. మరికొద్ది రోజుల్లో దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు రైల్వే సంస్థ ప్రయత్నిస్తున్నది.
వెంటనే స్టేషన్ మాస్టర్ కు విషయం చెప్పాలి!
‘అపరేషన్ అమనత్’ కాకుండా, మరో పద్దతి ద్వారా కూడా రైల్లో మర్చిపోయిన లగేజీని పొందే అవకాశం ఉంటుంది. తాము దిగిన రైల్వే స్టేషన్ లోని స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్లాలి. ఆయనకు విషయం చెప్పాలి. మర్చిపోయిన లగేజీలో చాలా ముఖ్యమైన వస్తువులు ఉన్నాయని చెప్పి ఆయనను కన్విన్స్ చేయాలి. వెంటనే స్టేషన్ మాస్టర్, రైలు వెళ్లే తర్వాతి పెద్ద స్టేషన్ మాస్టర్ కు కాల్ చేస్తారు. మీ బోగీ నెంబర్, బెర్త్ నెంబర్ ఆయనకు చెప్తారు. మీ లగేజీ వివరాలు అందిస్తారు. వాటిని ఎలాగైనా తీసుకోవాలని చెప్తారు. అతడు వాళ్ల స్టాఫ్ కు చెప్పి, ఆ లగేజీని సేఫ్ గా తీసుకొచ్చి రైల్వే స్టేషన్ లో ఉంచుతారు. సదరు ప్రయాణీకులు వెళ్లి వారి సామాన్లను ఆ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్లి తీసుకోవచ్చు. ఈ రెండు పద్దతుల ద్వారా పోగొట్టుకున్న సామాన్లను తిరిగి పొందే అవకాశం ఉంది.
త్వరలో దేశ వ్యాప్తంగా ‘అపరేషన్ అమనత్’ సేవలు
ప్రస్తుతం వెస్ట్రన్ రైల్వేస్ ‘అపరేషన్ అమనత్’ మంచి ఫలితాలను అందిస్తున్నది. నిత్యం చాలా మంది సామాన్లను ప్రయాణీకులకు సేఫ్ గా అందిస్తున్నది. అందుకే, ఈ సేవను మరింత విస్తరించాలని ఇండియన్ రైల్వేస్ భావిస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. రైల్లో మీ లగేజీ ఎవరూ కొట్టేయకపోతేనే మళ్లీ పొందే అవకాశం ఉంటుంది. అప్పటికే ఎవరైన తీసుకెళ్లి ఉంటే ఎవరూ ఏం చేసేది ఉండదు.
Read Also: వందే భారత్ VS పాకిస్తాన్ గ్రీన్ లైన్, వీటిలో ఏ రైలు తోప్ అంటే?