Indian Railways Rules: రాత్రి సమయంలో రైలు ప్రయాణం చేసే చాలా మంది ప్రయాణికులకు ఒకే భయం ఉంటుంది. నిద్రలో ఉండగా తమ స్టేషన్ దాటిపోతే ఏం చేయాలి? రైల్వే ఫ్రీగా తిరిగి అదే స్టేషన్‌కు తీసుకెళ్తుందా? టీసీ వస్తే జరిమానా పడుతుందా? మళ్లీ వెనక్కి వెళ్లాలంటే ఎలా? అనే డౌట్స్ చాలామందికి వస్తుంటాయి. దీనికి సంబంధించి భారతీయ రైల్వేలో స్పెషల్ రూల్స్ ఉన్నాయి. అవి ఏం చెప్తున్నాయంటే..
ఒకవేళ మీరు నిద్రపోయి మీ స్టాప్ దాటిపోతే, రైల్వే ఉచితంగా తిరిగి అదే స్టేషన్‌కు ప్రయాణించే అవకాశం కల్పించదు. ఈ పరిస్థితిలో వెంటనే రైలులో ఉన్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ లేదంటే రైలు గార్డును కాంటాక్ట్ కావాలి. వారికి విషయం చెప్తే, వాళ్లు అవసరమైన సూచనలు ఇస్తారు. మీరు ప్రయాణించిన అదనపు దూరానికి సంబంధించి ఛార్జీలు, అవసరమైతే జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. ఆ తర్వాత తిరిగి మీ స్టేషన్‌కు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
చాలామంది నిద్రపోయి స్టేషన్ దాటిపోతే రైల్వే ఉచితంగా వెనక్కి పంపుతుందని భావిస్తారు. కానీ, అలాంటి నిబంధన భారతీయ రైల్వేలో లేదు. ప్రయాణికుడి వ్యక్తిగత కారణాల వల్ల స్టేషన్ మిస్ అయితే బాధ్యత ప్రయాణికుడిదే అవుతుంది. దాటిపోయిన స్టేషన్‌కు తిరిగి వెళ్లాలంటే కొత్త టికెట్ కొనుగోలు చేయాలి. ఏ తరగతిలో ప్రయాణించాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా టికెట్ తీసుకుని ప్రయాణించాలి. టికెట్ లేకుండా తిరిగి ప్రయాణిస్తే, నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి జరిమానా విధించే అవకాశం ఉంది.
అయితే ప్రతి సందర్భంలో ఇదే నిబంధన వర్తించదు. కొన్నిసార్లు రైల్వే కారణాల వల్ల కూడా ప్రయాణికులు తమ స్టేషన్‌లో దిగలేకపోవచ్చు. సాంకేతిక కారణాలు, రైలు దారి మళ్లించడం, ఇతర రైల్వే నిర్ణయాల వల్ల రైలు నిర్ణీత స్టేషన్‌లో ఆగకపోతే పరిస్థితి మరోలా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ప్రయాణికులు TDR దాఖలు చేసి రీఫండ్ కోరే అవకాశం ఉంటుంది. అయితే TDRను రైల్వే నిర్ణయించిన గడువులోపే సమర్పించాలి. ఆలస్యం చేస్తే రీఫండ్ పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే రైల్వే కారణంగా స్టేషన్ మిస్ అయిన వెంటనే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రయాణంలో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మొబైల్‌లో అలారం పెట్టుకోవడం, గూగుల్ మ్యాప్స్, రైలు ట్రాకింగ్ యాప్‌ల ద్వారా స్టేషన్‌ను గమనించడం, కుటుంబ సభ్యులు, తోటి ప్రయాణికులకు ముందుగానే చెప్పడం వల్ల స్టేషన్ రాగానే అలర్ట్ కావచ్చు. రాత్రి ప్రయాణాల్లో ఈ చిన్న జాగ్రత్తలు మీ గమ్యస్థానాన్ని మిస్ కాకుండా చేస్తాయి.
Read Also: రైల్లో తలతిక్క వేషాలు.. వీణ్ణి బొక్కలో వేసి మక్కెలు విరగ్గొట్టండి సర్!