TOPCOS Council: దక్షిణాది బుల్లితెర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ టెలివిజన్ పరిశ్రమలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఒకే గొడుగు కింద చేరడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత రెండేళ్లుగా సాగిన సుదీర్ఘ చర్చలు, విశ్లేషణల అనంతరం ఎట్టకేలకూ చెన్నై వేదికగా జరిగిన సర్వసభ్య సమావేశంలో ‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’ (TOPCOS) అధికారికంగా ఏర్పడింది. దీనికి సంబంధించిన విధివిధానాలు, బైలాస్‌ను రూపొందించి పక్కా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసి నేడు ప్రెస్ మీట్ ద్వారా తెలియపరిచారు.ఈ సరికొత్త ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సౌత్ ఇండియన్ డిజిటల్, టెలివిజన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోందని నిర్వాహకులు బలంగా చెప్తున్నారు.
ఈ ప్రెస్ మీట్ లో టాప్కోస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏ ప్రసాద్ రావు మాట్లాడుతూ, ఈ రోజును సౌత్ ఇండియన్ టెలివిజన్, ఓటిటి రంగానికి ఒక చారిత్రాత్మక సుదినంగా చెప్పుకొచ్చారు. నాలుగు రాష్ట్రాల నిర్మాతల మండళ్లు కలిసి ఒకే వేదికపైకి రావడం వెనుక దాదాపు రెండున్నరేళ్ల కఠోర శ్రమ దాగి ఉందని గుర్తు చేశారు. నిజానికి 2011లో దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ వంటి దిగ్గజాల ఆధ్వర్యంలో ఏర్పడిన తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గత 15 ఏళ్లలో సాధించిన అద్భుత విజయాలే నేడు ఈ సౌత్ కౌన్సిల్ ఏర్పాటుకు బలమైన పునాదిగా నిలిచాయన్నారు. తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఒక పెద్ద దిక్కుగా నిలబడటమే కాకుండా, కరోనా వంటి విపత్కర కాలంలో 4.5 కోట్లకు పైగా నిధులు సేకరించి కార్మికులను ఆదుకున్న అనుభవం తమకు ఉందన్నారు.
ప్రస్తుత కాలంలో భాషా బేధాలు లేకుండా ఇంటర్ స్టేట్ ప్రొడక్షన్స్ బాగా పెరిగిపోయాయి. కన్నడ, తమిళ, మలయాళ పరిశ్రమల నుంచి నటీనటులు, టెక్నీషియన్లు తెలుగులోకి రావడం, ఇక్కడి వాళ్లు అక్కడికి వెళ్లి సీరియల్స్, ఓటిటి ప్రాజెక్ట్స్ చేయడం రొటీన్ గా మారింది. ఇలాంటప్పుడు ఆయా భాషల వర్కింగ్ కల్చర్ ను, బడ్జెట్లను, రెమ్యూనరేషన్లను గౌరవిస్తూనే, నిర్మాతల సంక్షేమం మరియు హక్కుల కోసం పోరాడే ఒకే ఒక్క కామన్ కోడ్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ టాప్కోస్ ను తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.
also read :రీల్స్ పిచ్చి కొంపముంచింది.. పక్కా ప్లాన్‌తో 10 లక్షలు లేపేసిన దొంగలు!
దాదాపు 17 మందితో కూడిన అడ్ హాక్ కమిటీ ఆరు నెలల పాటు కష్టపడి ఎలాంటి గైడ్ లైన్స్ లేకపోయినా ఒక స్పష్టమైన బైలాను తయారు చేసిందని వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీతో సమానంగా బుల్లితెర నటులకు గుర్తింపు దక్కుతున్న ఈ రోజుల్లో, కేవలం తెలుగులోనే 15 వేల మంది, మిగతా రాష్ట్రాల్లో మరికొన్ని వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, వారందరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ప్రభుత్వాల నుంచి రావాల్సిన రాయితీలు, సౌకర్యాల కోసం ఈ కౌన్సిల్ గట్టిగా పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు, టాప్కోస్ తదుపరి టార్గెట్ ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్’ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న టెలివిజన్, ఓటిటి నిర్మాతలను ఏకం చేసి ఒక నేషనల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయడమేనని ఆయన తన భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించారు.
ఇక ఈ సమావేశంలో తమిళనాడు టెలివిజన్ అండ్ ఓటిటి అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రస్తుత టాప్కోస్ వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ, గతంలో తాము ఎదుర్కొన్న వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలకు ఈ అసోసియేషన్ ద్వారా శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆనందం వ్యక్తం చేశారు. కర్ణాటక ఎగ్జిక్యూటివ్ మెంబర్ సునిల్ కుమార్ జే.కే మాట్లాడుతూ, తెలుగు ఇండస్ట్రీ కౌన్సిల్ డిసిప్లిన్ చూసి తాము ఎంతో అసూయపడ్డామని, ఇప్పుడు ప్రసాద్ రావు గారి చొరవతో అందరం కలిసి ప్రయాణించడం సంతోషంగా ఉందన్నారు.
also read :లైవ్ రిపోర్టర్‌కు ముద్దు పెట్టిన యువతి.. సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
కేరళ నుంచి ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణన్ సేతుకుమార్ ఈ రోజును పరిశ్రమ అభివృద్ధికి మూలస్తంభం అని చెప్పగా, చెన్నై నుంచి జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న రాజా వేలు మాట్లాడుతూ, హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆర్గనైజేషన్ విధానం తమకు ఎన్నో పాఠాలు నేర్పిందని, నటీనటుల డేట్ల సమస్యల వల్ల నిర్మాతలు నష్టపోకుండా ఉండేందుకు ఈ కౌన్సిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
చివరగా ట్రెజరర్ డి.వై. చౌదరి ఈ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సౌత్ ఇండియన్ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సరికొత్త సంచలన కౌన్సిల్ కు వైస్ ప్రెసిడెంట్లుగా ఉదయ్ శంకర్, అరవింద్, జి. జయ కుమార్ వ్యవహరిస్తుండగా, పి.ఆర్.ఓలుగా దుద్ది శ్రీను, బాబురావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి సౌత్ స్క్రీన్ పై రాబోయే రోజుల్లో ఈ టాప్కోస్ ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో చూడాలి.