Atacama Desert Clothing Mountain: ప్రపంచ వ్యాప్తంగా ఫాస్ట్ ఫ్యాషన్ వేగంగా పెరుగుతున్న కొద్దీ వస్త్ర వ్యర్థాల సమస్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని ఫోటోలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. చిలీలోని అటకామా ఎడారిలో పారేసిన సుమారు 60 వేల టన్నుల పాత బట్టలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. ఈ భారీ బట్టల గుట్టలు అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా స్పేస్ నుంచి తీసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి ఏడాది యూరప్, అమెరికా, కెనడా, ఆసియాలోని కొన్ని దేశాల నుంచి వాడిన బట్టలు చిలీకి భారీగా చేరుతుంటాయి. ఇవి ఇక్విక్ పోర్ట్ ద్వారా దిగుమతి అవుతాయి. తర్వాత వాటిని వేరు చేసి, బాగున్న దుస్తులను లాటిన్ అమెరికాలోని ఇతర దేశాలకు విక్రయిస్తారు. దీంతో వేలాది మందికి ఉపాధి కూడా లభిస్తోంది. అయితే, అన్ని బట్టలు అమ్ముడు కావు. నాణ్యత తక్కువగా ఉండటం, పాత ఫ్యాషన్ కావడం, దెబ్బతిన్న దుస్తులు అమ్ముడుపోకుండా మిగిలిపోతాయి. వీటిని అధికారికంగా వేస్టేజ్ సెంటర్స్ కు తరలించడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో, కొందరు అక్రమంగా అటకామా ఎడారిలో పడేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాటిని కాల్చివేస్తున్నారు.
ఇలా చాలా సంవత్సరాలుగా పారేసిన దుస్తులు భారీ పర్వతాల్లా మారిపోయాయి. ఇందులో జాకెట్లు, షూలు, పిల్లల దుస్తులు, ఇంకా కొన్ని కొత్త బట్టలు సైతం కనిపిస్తున్నాయి. అంటే కొన్ని వస్త్రాలు ఎవరూ ధరించకుండానే వ్యర్థాలుగా మారుతున్నాయన్న మాట. ఈ సమస్యకు ఫాస్ట్ ఫ్యాషన్ ప్రధాన కారణంగా పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తక్కువ ధరలకు కొత్త దుస్తులు సులభంగా లభిస్తుండటంతో, చాలామంది వాటిని కొద్దిసార్లు మాత్రమే ఉపయోగించి పారేస్తున్నారు. అలాగే దానం చేసిన బట్టలన్నీ అవసరమైన వారికి చేరుతాయని అనుకోవడం కూడా సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. అవి కూడా చివరకు వ్యర్థాలుగానే మిగిలిపోతాయంటున్నారు.
మరో పెద్ద సమస్య ఏంటంటే, లేటెస్ట్ దుస్తుల్లో ఎక్కువగా పాలీహెస్టర్ లాంటి సింథటిక్ ఫైబర్లు ఉంటాయి. ఇవి నేలలో త్వరగా కలిసిపోవు. దశాబ్దాల పాటు అలాగే ఉండి నేల, గాలి కాలుష్యానికి కారణమవుతాయి. వాటిని కాల్చినప్పుడు హానికరమైన వాయువులు విడుదలై సమీప ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కొన్ని సంస్థలు పాత బట్టలను రీసైకిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిని ఫైబర్లుగా మార్చి ఇన్సులేషన్ మెటీరియల్, నిర్మాణ సామగ్రి, ఫర్నిచర్ తయారీలో ఉపయోగించే సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నాయి. అయినప్పటికీ, ఇప్పటికే పేరుకుపోయిన టన్నుల కొద్ది వస్త్ర వ్యర్థాలను పూర్తిగా తొలగించడం అంత సులభం కాదు.
ఈ నేపథ్యంలో చిలీ ప్రభుత్వం కూడా కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. వస్త్ర తయారీ సంస్థలు, దిగుమతిదారులు, విక్రేతలు తమ ఉత్పత్తుల వ్యర్థాల నిర్వహణలో బాధ్యత వహించేలా చర్యలు చేపడుతోంది. అక్రమంగా చెత్త పారవేయడాన్ని అరికట్టేందుకు కూడా పలు చర్యలు అమలు చేస్తోంది. అటకామా ఎడారిలో కనిపిస్తున్న ఈ బట్టల పర్వతం ఒక్క చిలీ సమస్య మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఫాస్ట్ ఫ్యాషన్ సంస్కృతి, అధిక వినియోగం, సరైన వ్యర్థాల నిర్వహణ లేకపోవడం వల్ల ఏర్పడిన గ్లోబల్ పర్యావరణ సంక్షోభానికి స్పష్టమైన హెచ్చరికగా చెప్పుకోవచ్చు.
Read Also: డిస్నీల్యాండ్ కు పోటెత్తుతున్న టూరిస్టులు, మ్యాటర్ ఏంటో తెలుసా?