Central Cabinet: భారత ప్రధానిగా మోదీ మూడోసారి ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి భవన్ లో రేపు రాత్రి 7.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నది. మోదీతోపాటు కేబినెట్ లోని మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విదేశీ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. వారి కోసం ఇప్పటికే ఢిల్లీలోని పలు హోటళ్లను కూడా సిద్ధం చేశారు. ప్రమాణస్వీకారోత్సవం నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
అయితే, తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంపీలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ తాజా, మాజీ అధ్యక్షులు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కేంద్రమంత్రి పదవులు దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సజయ్ ఎంపీలుగా గెలిచారు. బండి సంజయ్ భారీ మెజారిటీతో కరీంనగర్ ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. వీరిద్దరినీ కూడా మోదీ తన టీమ్ లోకి తీసుకుంటున్నట్లు సమాచారం. పార్లమెంటులో కూడా మోదీని బండి సంజయ్ కలిసినప్పుడు ప్రత్యేకంగా భుజం తట్టి ప్రోత్సహించారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యాయి.
అదేవిధంగా మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ ను కూడా కేబినెట్ లోకి తీసుకునే అవకాశముందంటూ వార్తా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం వీరిద్దరినే కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇటు టీడీపీ నుంచి కూడా ముగ్గురు ఎంపీలకు మోదీ కేబినెట్ లో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్రమంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. శ్రీకాకుళం ఎంపీకైతే అత్యధిక అవకాశాలున్నాయని చెబుతున్నారు. అతను ఇప్పటికే ఎంపీగా పనిచేసిన అనుభవం, ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు ఉండడం.. వీటితోపాటు ధీటైన వాగ్ధాటి.. పలు అంశాలపై నాలెడ్జ్ ఉండడం.. ఇవన్నిటి దృష్ట్యా ఆయనకు కేంద్ర మంత్ర పదవి పక్కా అని పలువురు నేతలు అనుకుంటున్నారు.
ఇటు బీజేపీ నుంచి ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం రమేష్, పురంధేశ్వరి.. వీళ్లిద్దరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశముందంటున్నారు.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికలో తీన్మార్ మల్లన్న విజయం.. సీఎం రేవంత్ స్పెషల్ ట్వీట్
మోదీ కేబినెట్ లో బెర్త్ లు ఖాయమైన ఎంపీలు రేపు మోదీతోపాటు వారు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొదట ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ తరువాత వారు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కొంత ఆసక్తిగా ఆ వేడుక కోసం ఎదురుచూస్తున్నారు.