Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వి.నవీన్ యాదవ్ ఖరారు కావడంతో ఇక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బలమైన లోకల్ నాయకుడిగా, యువకుడిగా నవీన్ యాదవ్‌కు నియోజకవర్గంలో గట్టి పట్టు, మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువత సపోర్ట్ ఆయనకు ఎక్కువగా ఉంది. అయితే.. ఈ ఎన్నికల్లో కొన్ని అంశాలపై పట్టు సాధిస్తే ఆయన సులభంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది.
⦿ నవీన్ యాదవ్‌కు కలిసి వచ్చే అంశాలు..
నవీన్ యాదవ్‌కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఆయన గత కొన్నేళ్లుగా పండుగలు, ఇతర సందర్భాలలో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల నిర్వహించిన సామూహిక సీమంతాలు వంటి కార్యక్రమాలు మహిళా ఓటర్లలో సానుకూలతను పెంచే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యావంతుడైన యువకుడు కావడంతో యువతలో ఆయనకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిగా ఆయనను ఎంపిక చేయడం, బీసీలకు 42% రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయం.. సుమారు 1.40 లక్షలు బీసీ ఓటర్లు, 90వేల మైనార్టీ ఓట్లు ఉన్న ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అంశాలు అని చెప్పవచ్చు.
⦿ 2014లో నవీన్ ఎమ్ఐఎమ్ నుంచి పోటీ..
నవీన్ యాదవ్ మజ్లిస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 శాసనసభ ఎన్నికలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశాడు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ చేతిలో 9,242 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. నవీన్ కు 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఎంఐఎం పార్టీ టికెట్ నిరాకరించడంతో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ 18,817 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. నవీన్ యాదవ్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరాలని ముహమ్మద్ అజహరుద్దీన్ కోరడంతో నామినేషన్ విత్ డ్రా చేసుకొని ప్రస్తుతం సీఎం, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. AIMIM మద్దతు కూడా ఆయనకు పరోక్షంగా దక్కే అవకాశం ఉంది.
⦿ బీఆర్ఎస్‌కు ఇది కొంత ప్లస్ పాయింట్..
నవీన్ యాదవ్ వ్యక్తిగత బలం ఉన్నప్పటికీ, కొన్ని పార్టీ పరమైన, రాజకీయపరమైన సవాళ్లను అధిగమించాల్సి ఉంది. దివంగత నేత మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్ బీఆర్ఎస్ కు కొంత ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
⦿ మహిళా సెంటిమెంట్ పని చేస్తోందా..?
గోపీనాథ్‌కు నియోజకవర్గంలో మంచి సంబంధాలు ఉండటం, సునీత పోటీలో ఉండటం వల్ల మహిళా ఓటర్లు సెంటిమెంట్‌తో బీఆర్‌ఎస్ వైపు మొగ్గే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ చేసిన కొన్ని సేవా కార్యక్రమాలు, మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ఈ సెంటిమెంట్ ముందు నిలబడగలవా అనేది కీలకం. జూబ్లీహిల్స్‌లో మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అజారుద్దీన్‌ను నిలబెట్టినప్పటికీ విజయం దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఒక్క ముస్లిం నేతకు కూడా చోటు దక్కకపోవడంపై బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశం మైనార్టీ ఓటర్లలో కాంగ్రెస్ పట్ల కొంత వ్యతిరేకతకు లేదా నిరాసక్తతకు దారితీయవచ్చు. ఉప ఎన్నికకు ముందే మైనార్టీలకు మంత్రిపదవి వంటి హామీ దక్కి ఉంటే పరిస్థితి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
⦿ హైడ్రా ఎఫెక్ట్ పడేనా..?
సాధారణంగా హైదరాబాద్ నగర పరిధిలోని నియోజకవర్గాలలో బీఆర్‌ఎస్‌కు మంచి పట్టు ఉంది. ఈ ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన సానుకూలత బలంగా ఉండాలి. అక్రమ కట్టడాల కూల్చివేతకు తీసుకు వచ్చిన ఆపరేషన్ హైడ్రా ప్రభావం ఇక్కడి నుంచే (ఎన్-కన్వెన్షన్ కూల్చివేతతో) మొదలైంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతను పరోక్షంగా పెంచే అవకాశం ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ బస్తీ దవాఖానాల వంటి వాటి నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే ప్రచారం కూడా నవీన్ యాదవ్‌కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది.
⦿ జూబ్లీ కింగ్ ఎవరో మరీ..?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిచినంత సులభంగా ఇది ఉండకపోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు కావడంతో, ప్రభుత్వంపై సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతను నవీన్ యాదవ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నవీన్ యాదవ్ తన వ్యక్తిగత బలం, యువత మద్దతు, బీసీ కోటా వంటి సానుకూల అంశాలతో బరిలోకి దిగుతున్నప్పటికీ.. మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్, మైనార్టీ ఓటర్ల సమీకరణ, బీఆర్‌ఎస్ నగర ప్రాబల్యం వంటి ప్రధాన సవాళ్లను అధిగమించగలిగితేనే నవీన్ యాదవ్ జూబ్లీ కింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ అంశాల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది నవంబర్ 14న ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి.
ALSO READ: Jubilee Hills By-poll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీజేపీ గేమ్ మొదలు, దూకుడుగా కాంగ్రెస్-బీఆర్ఎస్