BJP Candidate: నేను ఆర్ఎస్ఎస్ మనిషిని సీటు నాకే వస్తుంది..? నాకూ ఆర్ఎస్ఎస్ అండ వుంది సీటు నన్నే వరిస్తుంది…? నాకు సంఘ్ తో సంబంధాలున్నాయి సీట్ నాకే కేటాయిస్తారు..? నేను ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నా ఆ స్థానం నాదే..? ఎవ్వరెన్ని చెప్పినా జూబ్లీహిల్స్ నా అడ్డా, మళ్లీ అధిష్టాన పెద్దలు నన్నే ఆశ్వీర్వదిస్తారు? ఇదీ ఇంత కాలం బీజేపీ జూబ్లీహిల్స్ టికెట్ ఆశావహులు వ్యక్తం చేస్తూ వచ్చిన ధీమా.. అయితే నామినేషన్ల ప్రక్రియకు టైమ్ సమీపిస్తుండటంలో బీజేపీ ఆశావాహుల్లో ఆందోళన మొదలైందట…
జూబ్లీహిల్స్‌లో ఇప్పటికే అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్దమైంది. ప్రధాన పార్టీలన్ని సమరానికి కాళ్లు దువ్వుతున్నాయి. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి కల్వకుంట్ల సెంటిమెంట్ కాకుండా మాగంటి సెంటిమెంట్ తో నెగ్గాలనే ప్లానింగ్ లో వుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం అభ్భర్థిని ప్రకటించింది. అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ కొనసాగినప్పటికీ నవీన్ యాదవ్‌కే జూబ్లీహిల్స్ టికెట్ కన్ఫర్మ్ చేసి, ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది . అంతేకాదు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలలో, నెరవేర్చిన హామీలను, నెరవేర్చబోయే హామీలతో పాటు, గత బీఆర్ఎస్ అవినీతి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్యాడర్‌ను సిద్దం చేసే పనిలో కాంగ్రెస్ వుంది.
అభ్యర్ధి కోసం బీజేపీ త్రిసభ్య కమిటీ ఏర్పాటు
ఇక బీజేపీ అందుకు భిన్నంగా పాచికలు వేస్తోంది. అభ్యర్థి ఎంపికలో ఎన్నడు లేని విధంగా త్రి సభ్య కమిటీ ఏర్పాటు చేసి, అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఏర్పాటు చేసిన కమిటీ 5 మంది అభ్యర్థులతో నివేదిక రాష్ట్ర నాయకత్వానికి అందజేసింది. రాష్ట్ర నాయకత్వం ఆ 5 మందిలో ముగ్గురి అభ్యర్థులతో కూడిన షార్ట్ లిస్ట్‌ను ఢిల్లీ పెద్దలకు పంపించే పనిలో పడింది. ఇవాలో రేపో ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసి, తుది రిపోర్ట్ హైకమాండ్ కు పంపించేందుకు రాష్ట్ర నేతలు సిద్దమవుతున్నారు..
ఆ ముగ్గురు ఎవరని ఆశావహుల్లో ఆందోళన
రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ హై కమాండ్ కు పంపించే ముగ్గురి పేర్ల షార్ట్ లిస్టులో ఎవరి పేర్లు ఉంటాయనే ఆందోళనలో ఆశావాహులున్నట్టు తెలుస్తోంది. త్రీ సభ్య కమిటీ ఇచ్చిన నివేదికలో ఇద్దరు మినహాయిస్తే మిగిత ముగ్గురు మహిళలే పోటీ పడుతున్నారు. ఎవరికి వారు తమకే సీట్ దక్కుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఢిల్లీ పెద్దలు ఎవరి పేరు ప్రకటిస్తారు..? ఎవరెవైపుకు మొగ్గు చూపుతారు..? సంఘ్ అండదండలున్నా వారికా..? సంఘ్ తో సంబంధాలున్నవారికా..? పార్టీని నమ్ముకొని వున్నవారికా..? ఎవరెన్ని చెప్పిన జూబ్లీహిల్స్ తన అడ్డా అంటున్న వారికా? హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్న టెన్షన్ అందరిలో కనిపిస్తోంది.
అసలీ త్రిసభ్య కమిటీని ఇంతకు ముందు ఎందుకు వేయలేదు
అయితే ఈ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై అవలంభించిన త్రీసభ్య కమిటీ విధానాన్ని గత ఉప ఎన్నికల్లో కావొచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కావొచ్చు ఎందుకు అమలు చేయలేదు, ఇప్పుడెందుకు ఈ పద్దతిని తీసుకొచ్చారనే చర్చ ఆ పార్టీలోనే కాదు సర్వత్రా జరుగుతోంది. గత ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారనే ప్రచారం కమలం పార్టీపై జోరుగా సాగింది. ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అదే తంతు ఏమైన జరుగుతోందా..? లేక గత ఎన్నికల్లో అవకాశం ఇచ్చిన లంకల దీపక్ రెడ్డికి చెక్ పెట్టేందుకే, ఈ త్రీసభ్య కమిటీని నియమించారా..? లంకల దీపక్ రెడ్డి కిషన్ రెడ్డికి సన్నిహితుడు కావోచ్చు కానీ ప్రస్తుతం వున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు కాదు. అందులో భాగంగానే మహిళలను తెరమీదకు తీసుకొచ్చారా…? లేక ఈ తతంగాన్ని కావాలనే సృష్టించి, కీలక నేతలు లబ్ది ఏమైనా పొందాలని చూస్తున్నారా…? అన్న చర్చ కాషాయ శ్రేణుల్లోనే జరుగుతోంది.
ప్రయోగాత్మకంగా మహిళకు అవకాశం ఇస్తారా?
సో జూబ్లీహిల్ప్ టికెట్ ఎవరికిస్తారు…? ఏ ప్రతిపదికన ఇస్తారు..? గత ఎన్నికల్లో పోటీ చేసినవారికే మళ్లీ అవకాశం ఇస్తారా..? లేక ఉప ఎన్నిక కాబట్టి ప్రయోగాత్మకంగా మహిళకు అవకాశం ఇస్తారా..? మహిళకు ఇస్తే గత ఓటింగ్ శాతం కంటే అధికంగా ఏమైనా సాధించగలమా అనే ఈక్వేషన్స్ ఏమైనా చూస్తారా..? లేదంటే బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చే విధంగా ఇంటర్నల్ గా ఏమైనా ఒప్పందాలు జరుగుతున్నాయా..? అనే అనేక సందేహాలు పొలిటికల్ సర్కిల్లో వ్యక్తం అవుతున్నాయి. ఏమైనా రెండు, మూడ్రోజుల్లో అభ్యర్థి ఎంపికపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. దీంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
జూటూరి కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ, ఆకుల విజయ..
ఇప్పటికే ఆశావహులు టికెట్ కోసం రాష్ట్ర నాయకత్వన్నే కాదు, ఢిల్లీ హైకమాండ్ ను సైతం ప్రసన్నం చేసుకునే పనిలో బిజిబిజీగా గడుపుతున్నట్టుగా తెలుస్తోంది. అధిష్టానం ప్రసన్నం లభిస్తుందో లేదో కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ నుంచి జూటూరి కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ, ఆకుల విజయ, లంకల దీపక్ రెడ్డి, అట్లూరి రామకృష్ణ పేర్లను త్రి సభ్య కమిటీ ఫైనల్ చేయడంతో బీజేపీలో రచ్చ రాజేసినట్టయ్యింది. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన లంక దీపక్ రెడ్డి ఇప్పటికే టికెట్ తనకేనని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేయించుకుంటున్నారు. దీపక్ రెడ్డి ప్రచారంపై ఆశావాహాలంతా గుర్రుగా వున్నారు.
కిషన్‌రెడ్డే వెనకుండి నడిపిస్తున్నారని ప్రచారం
అభ్యర్థిని ప్రకటించకుండానే దీపక్ రెడ్డి ఎలా ప్రచారం చేసుకుంటారు అంటూ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారట.. దీపక్ రెడ్డి ప్రచారం వెనక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే వెనకుండి నడిపిస్తున్నారనే టాక్ సైతం నడుస్తోంది.. అంతేకాదు రాష్ట్ర బీజేపీ రామచంద్రరావు నిర్ణయం ఎలా ఉండబోతుందో కానీ, జూబ్లీహిల్స్ టికెట్ పై మహిళ అభ్యర్థులు కూడా చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒకవేళ మహిళ మణులకు సీట్ దక్కకపోతే బీజేపీలో మహిళల నిర్ణయంఎలా వుంటుందోనన్న గుబులు పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
బీజేపీ అభ్యర్థి ఎవరు…? ఆపార్టీ అంతర్గత ప్లానింగ్స్ ఏంటి అనేది అటుంచుతే, జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో 7 డివిజన్లు ఉన్నాయి. బోరబండ, రహ్మత్ నగర్, షేక్ పేట్, యూసఫ్ గూడ, ఎర్రగడ్డ, వెంగళ్ రావు నగర్, శ్రీనగర్ కాలనీ. ఇందులో భాగం. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో 407 పోలింగ్ స్టేషన్లు, ప్రస్తుతం 3,98,982 ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య తుది జాబితా వరకు 4 లక్షలకు చేరే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఇందులో దాదాపు 1.3 లక్షల వరకు ముస్లింల ఓట్లు ఉండటం కీలకంగా మారింది. గెలుపోటములు నిర్ణయించేది ముస్లింలే కావడంతో బీజేపీ ఎలా గట్టెక్కుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ నెగ్గుకొస్తుందా?
కానీ హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ ఈ ఎన్నికల్లో గెలచి తమ సత్తా ఏంటో చూపిస్తామని చెబుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలను కొట్టాలంటే బీజేపీ అభ్యర్థితో పాటు, వ్యూహాలు కూడా కీలకం అవనున్నాయి. బీఆర్ఎస్ మహిళా నేతకు అవకాశమిచ్చినట్లే, బీజేపీ కూడా మహిళకే ఇస్తుందా..? గత ఎన్నికల్లో అవకాశం ఇచ్చిన లంకల దీపక్ రెడ్డికే మళ్ళీ అవకాశం ఇస్తుందా..? లేక ఇంకెవరికైన కేటాయిస్తుందా..? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.
Story By Rami Reddy, Bigtv