Assembly Boycott: ప్రజా సమస్యలపై అధికార, ప్రతిపక్షాలు ముఖాముఖిగా తలపడే వేదిక శాసనసభ. కానీ ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ కొనసాగిస్తోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడమే కారణమని జగన్ చెబుతున్నారు. అంతకు ముందు చంద్రబాబు కూడా తనకు అవమానం జరిగిందని బహిష్కరించారు. సీఎం అయ్యాకే వెళ్తానని చెప్పి ఇప్పుడు వెళ్తున్నారు. ఇక తెలంగాణలో KCR కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అవుతూ వస్తున్నారు. సభకు వెళ్లకుండా బయట ప్రజా సమస్యలపై పోరాడాలన్నది కేసీఆర్ వ్యూహం. అయితే సభకు రాకపోవడం ద్వారా ప్రభుత్వాన్ని ఎంతవరకు నిలదీయగలరు? బయట ప్రెస్‌మీట్లు, నిరసనలు ఒక మార్గమే కావచ్చు. కానీ ప్రజలు ఎన్నుకున్న సభలోనే ప్రభుత్వ సమాధానం రాబట్టడం మరో బాధ్యత కాదా అన్న ప్రశ్నలు వస్తున్నాయ్. ఇంకోవైపు… సభలో అధికార, ప్రతిపక్ష నేతల భాష కూడా మర్యాద దాటితే ప్రజాస్వామ్య చర్చకు అర్థమేంటన్న చర్చ జరుగుతోంది. గతంలో సీఎం హోదాలో కేసీఆర్ చాలా బూతులు మాట్లాడారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎవరు ఏ భాష వాడారన్నది పక్కన పెడితే… అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు ఆశించేది బూతులు కాదు… బలమైన వాదన.