చీమల్లో కూడా కులాలు ఉంటాయా? ఫలానా కులం వారు ఫలానా పని చేయాలంటూ కులవృత్తులు కూడా ఉంటాయా? ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచనే ఎవరికీ వచ్చి ఉండదు. కులం అని పేరు పెట్టలేం కానీ, పురాతన కాలంలో కులాల మధ్య పని విభజన ఎలా జరిగిందో అచ్చం అలాగే చీమల మధ్య కూడా పని విభజన జరిగిందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ కులాలను బట్టే అవి ఏం పని చేయాలో ముందుగానే నిర్ణయింపబడుతుందనమాట. అంటే ఇక్కడ ఆధిపత్య కులం, అణగారిన కులం కూడా ఉంటాయి. ఆధిపత్య కులం పెత్తనం చెలాయిస్తుంటే, అణగారిన కులాలకు చెందిన చీమలు శ్రామికులుగా ఆహారాన్ని పోగు చేస్తూ ఉంటాయి.
రాణి చీమ..
ఆధిపత్య కులం అంటే రాణి చీమదే. రాణి చీమ అంటే పరిమాణంలో పెద్దగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. పరిమాణంలో చిన్నవి కూడా రాణి చీమలుగా ఎదుగుతాయి. అది వాటి డీఎన్ఏలో స్పష్టంగా ఉంటుంది. రాణి చీమలు గుడ్లు పెట్టి సంతతిని వృద్ధి చేస్తాయి. మరికొన్ని చీమలు ఈ రాణి చీమలకు సంరక్షకులుగా ఉంటూ, వాటి కుటుంబ సభ్యుల లాగా ఫోజు కొడుతుంటాయి. ఇవి పెద్దగా పనిచేయవు. ఇక చివరిగా శ్రామిక జాతి. ఈ కులానికి చెందిన చీమలు కేవలం శ్రమ చేస్తుంటాయి. శ్రమ చేయడానికే ఇవి పుడతాయి. వీటికి సంతతిని అభివృద్ధి చేసే పునరుత్పత్తి వ్యవస్థలు ఉండవు. అంటే ఆ కులంలో పుడితే చచ్చే వరకు పనిచేస్తూనే ఉండాలి. రాణి చీమకు, వారి కుటుంబానికి సేవకులుగానే బతకాలి.
డీఎన్ఏ ప్రభావం..
చీమలపై చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ చిన్న జీవులు కష్టంలో మానవులకు ఆదర్శంగా నిలుస్తుంటాయి. చీమల్లోని క్రమశిక్షణ, కష్టపడే తత్వం మనిషికి ఆదర్శం అని అంటుంటారు. అంతకు మించి చీమలపై మరిన్ని పరిశోధనలు కూడా జరిగాయి. అయితే చీమల కాలనీలో ఒక్కో చీమ ఒక్కోరకంగా ప్రవర్తించడం పరిశోధకులకు ఆసక్తిగా మారింది. రాణి చీమను ఎవరు ఎన్నుకుంటారు, శ్రామిక చీమలు ఎప్పుడూ తిరుగుబాటు చేయవా అనే ప్రశ్నలు వారికి వచ్చాయి. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇంతవరకు తట్టలేదు. పుట్టుకతోనే చీమల్లో ఈ వ్యత్యాసం ఉంటుందా, లేక డీఎన్ఏ ప్రభావమా అని కూడా శాస్త్రవేత్తలు బుర్రబద్దలు కొట్టుకున్నారు. ఇటీవల ది రాక్‌ఫెల్లర్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో కొత్త విషయాలు బయటపడ్డాయి.
మగ చీమలు లేకుండానే పునరుత్పత్తి
ఈ పరిశోధనలో క్లోనల్ రైడర్ చీమలు, ఊసెరియా బిరోయ్‌లను ఉపయోగించారు. ఈ జాతి చీమలు మగ చీమలు లేకుండా పునరుత్పత్తి చేస్తాయి, కాబట్టి అన్నీ ఒకే జన్యువులను పంచుకుంటాయి. దీంతో పరిశోధకులు.. ఆ చీమలకు ఆహారం, అవి నివశించే వాతావరణాన్ని మార్చి ప్రయోగాలు చేశారు. రాణి చీమను ఎవరు ఎన్నుకుంటారో తెలుసుకోవడమే వారి లక్ష్యం. పెద్ద చీమలకు రెక్కలు, కళ్లు పెద్దవిగా ఉంటాయి. అండాశయం కూడా ఉంటుంది. కానీ అన్ని పెద్ద చీమలు రాణి చీమలు కాలేవు. అదే సమయంలో చిన్న చీమలు అన్నీ కార్మికులుగా మిగిలిపోవు. పాట్రిక్ పీకర్స్కీ అనే శాస్త్రవేత్త ఈ దృగ్విషయాన్ని చక్కగా వివరించారు. చీమల ఆకారాన్ని పరిమాణాన్ని జన్యువులు నిర్ణయిస్తాయని ఆయన తేల్చారు. అంటే ఒకేరకమైన ఆకారం ఉన్న రెండు చీమల్లో ఒకటి రాణి చీమగా, మరొకటి కార్మిక చీమగా జీవితాన్ని గడపచ్చనమాట. అంటే చీమల్లో కూడా కుల వ్యవస్థను పోలిన విభజన వ్యవస్థ ఉందని శాస్త్రవేత్తలు నిర్థారించారు.