ఆన్ లైన్ కేటుగాళ్లు అమాయకులను మోసం చేసి, అందినకాడికి దండుకునేందుకు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. వాళ్ల ఎరకు చిక్కి ఎంతో మంది నట్టేట మునుగుతున్నారు. తాజాగా ఓ స్కామర్లు చెప్పిన ఓ ఆసక్తికర కట్టుకథను విని పుణేకు చెందిన 44 ఏళ్ల కాంట్రాక్టర్ అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా రూ. 11 లక్షలు కోల్పోయాడు. చివరకు మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూణేలోని బెనర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. మోసపోయిన కాంట్రాక్టర్ సెప్టెంబర్ లో సోషల్ మీడియాలో ఓ వీడియో చూశాడు. ఆ క్లిప్ లో ఓ మహిళ ఓ విషయాన్ని చెప్పింది. “నేను తల్లి కావాలి అనుకుంటున్నాను. నాకు సాయం చేసే వ్యక్తి కోసం చూస్తున్నాను. నాకు సహకరించిన వ్యక్తికి రూ.25 లక్షలు బహుమతిగా ఇస్తాను. అతడి ఎడ్యుకేషన్, క్యాస్ట్, అందం గురించి పట్టించుకోను” అని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. ఈ వీడియోను చూసిన సదరు కాంట్రాక్టర్ అందులో ఇచ్చిన నెంబర్ కు కాల్ చేశాడు. ఆ కాల్ కు సమాధానం ఇచ్చిన వ్యక్తి తాను ‘ప్రెగ్నెంట్ జాబ్’ అనే ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు. ఈ జాబ్ కోసం సెలెక్ట్ అయ్యే ముందు కొన్ని రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది వారాల్లో స్కామర్లు రిజిస్ట్రేషన్, ఐడి కార్డ్, వెరిఫికేషన్, జిఎస్టి, టిడిఎస్, ఇతర ఛార్జీలు అంటూ డబ్బులు అడిగారు. అంతేకాదు, స్కామర్లు రోజూ సదరు కాంట్రాక్టర్ తో టచ్ లో ఉండేవారు. ప్రతిసారీ చిన్న చిన్న అమౌంట్ రకరకాల పేరుతో అడిగేవారు. సెప్టెంబర్ ప్రారంభం నుంచి అక్టోబర్ 23 మధ్య.. బాధితుడు UPI, IMPS ద్వారా 100 కి పైగా ఆన్ లైన్ చెల్లింపులు చేశాడు. మొత్తంగా రూ. 11 లక్షలు సమర్పించుకున్నాడు.
కొద్ది వారాల తర్వాత ఇంకా ఎన్ని రోజులు అని స్కామర్లను కాంట్రాక్టర్ నిలదీశాడు. వెంటనే అతడి నెంబర్ ను సైబర్ కేటుగాళ్లు బ్లాక్ చేశారు. అప్పటి అతడికి విషయం అర్థం అయ్యింది. తాను మోసపోయానని గ్రహించి బెనర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనను మోసం చేసేందుకు కేటుగాళ్లు ఉపయోగించిన ఫోన్ నంబర్లు, అకౌంట్స్, డిజిటల్ వివరాలను పోలీసులకు అందించాడు. వాటి ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు, 2022 చివరి నుంచి పలు రాష్ట్రాల్లో ఇలాంటి స్కామ్‌లు జరుగుతున్నట్లు సైబర్ నిపుణులు వెల్లడించారు. ప్రెగ్నెన్సీ జాబ్స్ పేరుతో ఫేక్ యాడ్స్ ఇస్తూ, అందినకాడికి దండుకుంటున్నట్లు చెప్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులకు సంబంధించి పోలీసులు పలువురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also: గుడి గోడలపై ‘ఐ లవ్ మొహమ్మద్’ అని రాతలు.. నలుగురు హిందువులు అరెస్ట్!