వృద్ధాప్యంలో ఉన్న తనను కోడలు పట్టించుకోవడం లేదని, ఆమె నుంచి తనకు ప్రతి నెలా భత్యం అందేలా చూడాలంటూ ఓ వృద్ధుడు వేసిన కేసుపై రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇకపై కోడలు తన జీతంలో నుంచి ప్రతి నెలా రూ. 20 వేలు మామ అకౌంట్ లో జమ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జోధ్ పూర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ ఫర్జాండ్ అలీ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 1 నుంచి అతడి ఖాతాలో ప్రతి నెలా రూ. 20 వేలు వేయాలని ఆదేశించారు. ఆ వృద్ధుడు జీవించినంత కాలం ఆ డబ్బులు పంపించాలని వెల్లడించారు.
అల్వార్ లోని కతుమార్ నివాసి భగవాన్ సింగ్ సైని కొడుకు రాజేష్ కుమార్ అజ్మీర్ విద్యుత్ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేసేవాడు. అతను సెప్టెంబర్ 15, 2015న సర్వీస్ లో ఉండగా చనిపోయాడు. రాజేష్ మరణం తర్వాత, ఆ శాఖ సెప్టెంబర్ 21, 2015న భగవాన్ సింగ్ ను కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ లేఖ రాసింది. భగవాన్ సింగ్ ఆ ఉద్యోగాన్ని తన కోడల, రాజేష్ భార్య అయిన శశి కుమారికి ఇవ్వాలని కోరాడు. ఆయన విజ్ఞప్తి మేరకు తన కోడలికి LDC ఉద్యోగం ఇచ్చింది.
శశి కుమరి ఉద్యోగ నియామక సమయంలో అక్టోబర్ 19, 2015న ఒక అఫిడవిట్‌ను సమర్పించింది. అందులో మూడు వాగ్దానాలు ఉన్నాయి. మొదటిది, ఆమె తన భర్త తల్లిదండ్రులతో నివసించడం, రెండోది వారి సంక్షేమానికి పూర్తి బాధ్యత తీసుకోవడం.. మూడవది, ఆమె తిరిగి వివాహం చేసుకోనని అందులో వివరించింది. అయితే, భర్త మరణించిన 18 రోజుల్లోనే తన అత్తమామల ఇంటిని విడిచిపెట్టి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిపోయింది. ఆ తర్వాత అత్తామామలను పట్టించుకోవడం మానేసింది. పైగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
తన కొడుకు ఉద్యోగాన్ని పొంది, వేరో వ్యక్తిని పెళ్లి చేసుకుని తమను పట్టించుకోవడం లేదంటూ కోడలు మీద మామ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్ అయిన మామ ఆరోపణులు అన్నీ వాస్తవం అని నమ్మింది. ఉద్యోగం పొందేనాడు ఇచ్చిన అఫిడవిట్ ను బేస్ చేసుకుని భగవాన్ సింగ్ సైనికి కోడలు తప్పకుండా అండగా నిలవాల్సిన అవసరం ఉందని తేల్చింది. నవంబర్ 1, 2025 నుంచి శశి కుమారికి వచ్చే జీతం నుంచి ప్రతి నెలా రూ. 20 వేలు మామ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఈ డబ్బులు భగవాన్ సింగ్ సైని దంపతులు బతికి ఉన్నంత కాలం ఇవ్వాలని తీర్పు ఇస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: పేషెంట్ ను నడిరోడ్డు మీద స్ట్రెచర్ మీద తోసుకెళ్లిన బంధువులు, మరీ ఇంత ఘోరమా?