Bihar Plumber Shocked: ఖాతాలో కనీసం వంద రూపాయలు ఉండటమే గగనమైన ఒక సామాన్య కార్మికుడి అకౌంట్‌లోకి అకస్మాత్తుగా వందల కోట్లు వచ్చి పడితే ఆ కిక్కే వేరు. సరిగ్గా ఇలాంటి ఒక ఊహించని మలుపు బీహార్‌కు చెందిన ఒక ప్లంబర్ కి ఎదురైంది.యస్ .. అతని బ్యాంక్ ఖాతాలో ఒక్కసారిగా వందల కోట్లు జమకావడంతో ఆ వ్యక్తితో పాటు స్థానిక పోలీసులు, బ్యాంక్ అధికారులు సైతం నోరెళ్లబెట్టారు. ఏటీఎం నుంచి కేవలం 1300 రూపాయలు డ్రా చేస్తే, ఆ తర్వాత అకౌంట్‌లో ఏకంగా రూ. 294 కోట్లు కనిపించడంతో రాత్రికి రాత్రే అతడు కుబేరుడిగా మారిపోయాడు.
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని గయా జిల్లా మస్త్‌పురా గ్రామానికి చెందిన వికాష్ కుమార్ అనే యువకుడు ప్లంబింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజంతా కష్టపడితేనే కానీ ఇల్లు గడవని పేద కుటుంబం అతనిది. బుధవారం రోజు ఒక కస్టమర్ పంపిన రూ. 1,300 నగదును విత్ డ్రా చేసుకున్న తర్వాత అతని ఖాతాలో కేవలం రూ. 113 మాత్రమే మిగిలాయి. అయితే, గురువారం ఉదయానికి అతని మొబైల్‌కు వచ్చిన ఒక మెసేజ్ వికాష్‌ను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉదయం నిద్ర లేచి చూసేసరికి అతని అకౌంట్ బ్యాలెన్స్ ఏకంగా రూ. 94 కోట్లకు చేరింది. ఆ వింత నుంచి తేరుకోకముందే, సాయంత్రానికి ఆ మొత్తం ఏకంగా రూ. 294 కోట్లకు పెరగడంతో అతని మైండ్ బ్లాంక్ అయిపోయింది.
also read :జాన్వీ టు మీనాక్షి.. టాలీవుడ్‌లో గ్లామర్ బొమ్మలుగానే హీరోయిన్లు?
సాధారణంగా అంత డబ్బు కనిపిస్తే ఎవరైనా ఆనందపడతారు, విలాసవంతగా గడపాలని ప్లాన్స్ వేసుకుంటారు. కానీ, వికాష్ కుమార్ మాత్రం భయపడిపోయాడు. ఇంత భారీ మొత్తంలో డబ్బు తన అకౌంట్‌లోకి ఎలా వచ్చిందో తెలియక కంగారుపడ్డాడు. ఆ సొమ్మును ముట్టుకునేందుకు కూడా ధైర్యం చేయలేదు. వెంటనే ఈ విషయాన్ని గ్రామంలోని స్థానిక నాయకులకు చెప్పాడు. వారి సూచన మేరకు లేట్ చేయకుండా బోధ్‌గయ పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీసి ఆ కోట్ల వ్యవహారంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ప్లంబర్ ఫిర్యాదుతో బోధ్‌గయ పోలీసులు తక్షణమే స్పందించారు. ఈ వింత కేసుపై పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ సింగ్ స్పందిస్తూ, ఇది అత్యంత సున్నితమైన ఆర్థిక విషయమని పేర్కొన్నారు. వికాష్ కుమార్‌కు సంబంధించిన బ్యాంక్ రికార్డులు, సర్వర్ లాగ్‌లు, లావాదేవీల ఐడీలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఈ భారీ సొమ్ము ఏదైనా సాంకేతిక లోపం వల్ల లేదా బ్యాంకింగ్ సర్వర్ పొరపాటు వల్ల జమైందా, లేక దీని వెనుక అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా హ్యాకర్లు అమాయకుల బ్యాంక్ ఖాతాలను మనీ లాండరింగ్ కోసం వాడుతుంటారని, ఈ కోణాన్ని కూడా కొట్టిపారేయలేమని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ డిజిటల్ యుగంలో ఒక నిరుపేద ప్లంబర్ అకౌంట్‌లో ఇన్ని కోట్లు ప్రత్యక్షం కావడం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.