మీరు బీదలు అయితే మేం బీదాతి బీదలం.
అప్పుచేసి పప్పుకూడు సినిమాలో ఎస్వీఆర్ ఫేమస్ డైలాగ్ ఇది.
పేదవారిలో నిరుపేదవాడిని బీదాతి బీద అని పిలవొచ్చు అంటూ రచయిత ఈ పదప్రయోగం చేశారు. అసలు నిరుపేద అంటే అర్థమేంటి..? ఆ నిరుపేద వార్షిక ఆదాయం ఎంతుంటుంది? వీటి గురించి చెప్పడం, వివరించడం కూడా కష్టమే. ఎందుకంటే ప్రభుత్వం కూడా పావర్టీ లైన్ అనే ఒక విభజన రేఖ గీసి.. దానికంటే కింద ఉన్న అందర్నీ బిలో పావర్టీ లైన్ (BPL) అంటూ ఒకే గాటన కట్టింది. ఆ గీతలో చిట్ట చివరి వ్యక్తి ఎవరనేది మాత్రం తేల్చాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. కానీ అనుకోకుండా ఆ బీదాతి బీద, భారత్ లోనే నిరుపేద ఒకరు వెలుగులోకి వచ్చారు. ఆయన పేరు రాం స్వరూప్. ఏడాదికి ఆయన సంపాదన కేవలం 3 రూపాయలు.
రూ.3 రూపాయల ఆదాయం..
భారత దేశంలో ఓ వ్యక్తి ఏడాదికి 3 రూపాయలు సంపాదిస్తూ బతకగలడా. అలా బతకాలంటే గాలి భోంచేయాల్సిందే. లేదా అడుక్కుని తింటూ అయినా ఉండాలి. పోనీ అడుక్కు తినేవారికయినా కాస్తో కూస్తో సంపాదన ఉంటుంది. అడుక్కున్న దానిలో తిండికి పోను రోజుకి 10 రూపాయలు మిగుల్చుకున్నా ఏడాదికి 3600 రూపాయలు సంపాదించినట్టవుతుంది. కానీ ఏడాదికి 3 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాడంటే అతడు ఏం చేస్తున్నట్టు? అసలీ బీదాతి బీదకు వార్షిక ఆదాయం 3రూపాయలు అని సర్టిఫికెట్ ఇచ్చిందెవరు..?
ఇన్ కమ్ సర్టిఫికెట్..
3 రూపాయల ఆదాయన్ని అసలు ఆదాయంగా గుర్తించడమే అమాయకత్వం అనుకుంటే, దానికొక సర్టిఫికెట్ కూడా ఇచ్చారు మన రెవెన్యూ శాఖ అధికారులు. మధ్యప్రదేశ్ లోని 45 ఏళ్ల రైతు రాం స్వరూప్ కి వార్షికాదాయం రూ.3 అంటూ స్థానిక తహశీల్దార్ సౌరభ్ ద్వివేది ఇన్ కమ్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్ కాపీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రాం స్వరూప్ ని దేశంలోనే అత్యంత పేదవాడిగా సర్టిఫై చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక్కసారిగా రాం స్వరూప్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. అసలు రాం స్వరూప్ ఎవరు, ఏం చేస్తుంటారు అనే ఎంక్వయిరీలు మొదలయ్యాయి. సత్నా జిల్లా కోఠి తహసీల్ కి చెందిన నయాగావ్ గ్రామానికి చెందిన రాం స్వరూప్ స్థానికంగా ఫేమస్ అయిపోయాడు. నిజంగానే రాం స్వరూప్ ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉందా అంటూ చాలామంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
క్లరికల్ ఎర్రర్..
3 రూపాయలు సంపాదించే రైతు రాం స్వరూప్ కి అసలు ఇన్ కమ్ సర్టిఫికెట్ ఎందుకు, ఏం అవసరమొచ్చిందో తెలియదు కానీ ఆయన పేరిట సర్టిఫికెట్ మాత్రం మంజూరైంది. అయితే దీన్ని క్లరికల్ ఎర్రర్ గా అధికారులు తేల్చేశారు. ఆన్ లైన్ లో డేటా ఎంటర్ చేసే క్రమంలో తప్పు దొర్లిందని అందుకే కేవలం 3 రూపాయల ఆదాయం అంటూ పొరపాటుగా ప్రింట్ అయిందని అంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా కూడా రెవెన్యూ అధికారులు చేసిన తప్పు దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది.