కొన్ని విషయాలను విని.. ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాదు. తప్పు ఎవరిది అని జడ్జ్ చేసే పరిస్థితుల్లోనూ ఉండలేం. కారణం, మనం విన్నది నిజం కాకపోవచ్చు. కళ్లతో చూసింది కూడా వాస్తవం కాకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఈ రోజుల్లో ఏది నిజమో? ఏది అబద్దమో? చెప్పలేని పరిస్థితి. దానికి కారణంగా సోషల్ మీడియా. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. ఈ రెండూ ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయాయి. విన్నది, చూసింది నిజమా? కాదా? అని ఆలోచించే తీరిక కూడా జనాలకు లేకుండాపోతుంది. ఎక్కడెక్కడి చెత్తను అంతా తెచ్చి సోషల్ మీడియాలో నింపేస్తున్నారు. ఇప్పుడు ఈ సోది అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. దానికి కారణం నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? అసలు సంగతి ఏంటి?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో హర్యానాలోని కైతాల్ జిల్లాకు చెందినదిగా నెటిజన్లు క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో ఓ తొమ్మిది సంవత్సరాల అమ్మాయి, తన చేతిలో చంటి బిడ్డను పట్టుకుని ఆడిస్తుంది. ఆ బిడ్డ ఎవరో కాదు, ఆమె కడుపున పుట్టిన చిన్నారే. ఆమె బిడ్డను కనడానికి కారణంగా స్వయానా ఆమె అన్న. 12 ఏళ్ల వయసున్న ఆ కుర్రాడు ఆమెపై లైంగిక దాడి చేసి, ఓ బిడ్డ పుట్టేందుకు కారణం అయ్యాడు. తన అన్న చేసిన పాడు పనికి, అభం శుభం తెలియని, చిన్నారి ఓ బిడ్డకు తల్లి అయ్యింది. ఇదీ ఆ వీడియో సారాంశం.
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అన్నను చంపేయాలని కొంత మంది అంటుంటే, సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదని మరికొంత మంది తెగ బాధపడిపోతున్నారు. కలియుగంలో ఇలాంటి ఘోరాలే చూడాల్సి ఉంటుందని ఇంకొంత మంది తమ వ్యూను ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు. కానీ, ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అందరూ అనుకునేది వేరు. అసలు కథ వేరు.
నిజానికి ఈ కథనం ముమ్మాటికీ ఓ కట్టుకథ. జనాలను తప్పుదోవ పట్టించే వైరల్ వీడియో. అసలు ఆ వీడియో ఇప్పటిది కాదు. దానికి లింక్ చేసి చెప్పిన కథకు సంబంధమే లేదు. మార్చి 5, 2025న కైతాల్‌లోని NIILM విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యార్థుల కోసం జరిగిన సెమినార్ లో గీత అనే ఓ పోలీసు అధికారి ఓ కేసు గురించి ప్రస్తావించారు. అందులో ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో తప్పుగా స్ప్రెడ్ చేస్తుంటారని చూపించారు. ఇప్పుడు ఆ విజువల్ కు కొత్త కథను అల్లి నెట్టింట వైరల్ చేస్తున్నారని.. అసలు అలాంటి ఘటన ఎక్కడ జరగలేదని పోలీసులు వెల్లడించారు. తప్పుడు సమాచారంతో గందరగోళం సృష్టించేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆ పాపకు, పాప ఆడిపించే చిన్నారికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆమెను వాళ్ల అన్నయ్య రేప్ చేశాడని చెప్పడం కూడా నిజం కాదన్నారు. ఇలాంటి అసత్య వార్తలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Read Also: అక్కడ అర్థరాత్రి పూట నీళ్లు మిలమిల మెరుస్తాయ్, నిజంగా ఇదో వండర్!