Visakha Students: సినిమాలు పిల్లల మీద ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తాయనే దానికి ఈ ఘటన ఓ నిలువెత్తు నిదర్శనం. లేత మెదళ్లను ఎలా కలుషితం చేస్తాయనడానికి ప్రత్యక్ష ఉదాహారణ. సినిమా చూడ్డమే కాదు.. దాన్ని నిజ జీవితానికి అప్లై చేయాలనుకున్నారు కొందరు విద్యార్థులు. రీల్ లైఫ్, రియల్ లైఫ్ ఒకటే అని భ్రమపడ్డారు. హీరో లాగే డబ్బులు సంపాదించాలనుకుని ఏకంగా హాస్టల్ గోడదూకి పారిపోయారు. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది.
‘లక్కీ భాస్కర్’ సినిమా చూసి..
విశాఖపట్నంలోని ఆంథోనీ బోర్డింగ్ హోమ్ కు చెందిన నలుగురు విద్యార్థులు రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’ సినిమా చూశారు. 9వ తరగతికి చెందిన జి. రఘు, బి. చరణ్, ఎస్. కిరణ్ కుమార్, పి. కార్తీక్ కు.. ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఆయన చేసేది తప్పే అయినా, ఆ పనిలో మంచినే చూశారు. సినిమా అయిపోయాక.. హాస్టల్ కు తిరిగి వచ్చారు. అయినా, ‘లక్కీ భాస్కర్’ వారి మైండ్ లో నుంచి వెళ్లిపోలేదు. ఎలాగైనా తామూ ‘లక్కీ భాస్కర్’ మాదిరిగానే డబ్బు సంపాదించాలి అనుకున్నారు. కార్లు, బంగళాలు, బంగారం.. అనుకుంటూ పెద్ద పెద్ద కలలు కన్నారు. చదువుకోవడం వేస్ట్ అనుకున్నారు. ‘లక్కీ భాస్కర్’ బాటలో పయణించేందుకు నలుగురూ తమ బ్యాగులు సర్దుకుని, గోడదూకి పారిపోయారు.
నిర్వాహకులు ఇలా.. తల్లిదండ్రులు అలా..
సీన్ కట్ చేస్తే.. బోర్డింగ్ హోమ్ లో నలుగురు విద్యార్థులు మాయం అయ్యారు. ఇంటికి వెళ్లారేమో అనుకున్నారు నిర్వాహకులు. తమ పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారని తల్లిదండ్రులు అనుకున్నారు. ఎందుకైనా మంచిదని ఓసారి విద్యార్థుల పేరెంట్స్ కు ఫోన్ చేశాడు బోర్డింగ్ హోమ్ వార్డెన్. ఇంటికి రాలేదని చెప్పడంతో షాక్ అయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు, బోర్డింగ్ హోమ్ నిర్వాహకులు కలిసి పోలీసులను కలిశారు. నలుగురు విద్యార్థులు కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న మహారాణిపేట పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కొనసాగుతున్న దర్యాప్తు
పోలీసులు ముందుగా బోర్డింగ్ హోమ్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సోమవారం సాయంత్రం పూట నలుగురు తమ బ్యాగులు తీసుకుని, గోడదూకి పారిపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. అటు విద్యార్థుల హాస్టల్ కు దగ్గర్లో ఉన్న మరో సీసీటీవీలోనూ వాళ్లు వెళ్లిపోతున్నట్లు కనిపించింది. విద్యార్థుల కోసం పోలీసులు అన్ని చోట్లా గాలింపు చర్యలు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ విశాఖలో పోలీసులు వాల్ పోస్టర్లు అంటించారు. ప్రత్యేక బృందాల ద్వారా వారి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
BREAKING – Four 9th-grade students from St. Ann's High School, Visakhapatnam, escaped their hostel after watching @dulQuer's #LuckyBaskhar, they told their friends they would return after earning money to buy cars and houses, inspired by #DulquerSalmaan's character in the film pic.twitter.com/X4iUa6bjc9
— Daily Culture (@DailyCultureYT) December 10, 2024
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
అటు తమ పిల్లలు ఎక్కడికి వెళ్లారో తెలియక, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఎక్కడికి వెళ్లినా త్వరగా ఇంటికి తిరిగి రావాలంటూ కంటతడి పెడుతున్నారు. ఎలాగైనా తమ పిల్లలను క్షేమంగా తమ దగ్గరికి క్షేమంగా చేర్చాలని పోలీసులను వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన విశాఖలో సంచలనంగా మారింది. అటు వీలైనంత త్వరగా విద్యార్థుల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తామంటున్నారు విశాఖ పోలీసులు. వాళ్లు దొరికాక, ఎందుకు పారిపోయారనే విషయంపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Read Also: మోహన్ బాబు పై పోలీసులు సీరియస్… కేసు నమోదు