Surgery on Wrong Eye| కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ అని అప్పుడెప్పుడో లెజండరీ సింగర్ ఘంటసాల పాట పాడారు. కానీ వైద్య రంగంలో మాత్రం అది భారీ పొరపాటే అని తాజాగా తేలింది. ఒక ఏడేళ్ల బాలుడికి కంట్లో సమస్య ఉందని డాక్టర్ వద్దకు వెళితే.. ఆ డాక్టర్ సమస్య ఉన్న కంటికి కాకుండా మరో కంటికి ఆపరేషన్ చేశాడు. ఇదేంటని అడిగితే పెద్ద గొడవే జరిగింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ గామా వన్ ప్రాంతానికి చెందిన ఆనంద్ స్పెక్ట్రమ్ హాస్పిటల్ లో నవంబర్ 11న నితిన్ భాటీ అనే వ్యక్తి తన ఏడేళ్ల కొడుకు యుధిష్ఠిర్‌కు ఎడమ కంటిలో సమస్య ఉందని వెళ్లాడు. హాస్పిటల్ లోని డాక్టర్ ఆనంద్ వర్మ పిల్లాడిని పరీక్షించి ఎడమ కంట్లో ఏదో నలుసు ఉందని.. దాన్ని ఆపరేషన్ ద్వారానే తీయాలని చెప్పారు. దీంతో మరుసటి రోజు నవంబర్ 12న పిల్లాడికి కంటి ఆపరేషన్ చేశారు. కంటి ఆపరేషన్ చేసినందుకు రూ.45000 ఖర్చు అయింది.
అయితే ఆపరేషన్ చేసిన తరువాత అదే రోజు సాయంత్రం నితిన్ భాటీ తన కొడుకుని తీసుకొని ఇంటికి వెళ్లాడు. ఇంట్లో అతని భార్య పిల్లాడిని చూసి ఆశ్చర్య పోయింది. ఎడమ కంటికి సమస్య ఉంటే కుడి కంటికి ఎందుకు ఆపరేషన్ చేశారని అడిగింది. అప్పటివరకు నితిన్ భాటీ ఈ విషయం గమనించలేదు. వెంటనే పిల్లాడిని తీసుకొని తిరిగి ఆస్పత్రికి వెళ్లి అలా ఎందుకు చేశారని.. అయినా బాగున్న కుడి కంట్లో ఏం ఆపరేషన్ చేశారని నిలదీశాడు. దీంతో డాక్టర్ ఆనంద్ వర్మ అక్కడి నుంచి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. కానీ తనకు సమాధానం చెప్పేంతవరకు అక్కడి నుంచి కదిలేది లేదని నితిన్ భాటీ అక్కడే కూర్చున్నాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది అతడిని బలవంతంగా బయటికి గెంటేసింది.
ఈ ఘటన తరువాత నితిన్ భాటీ నోయిడాలోని గౌతమ్ బుద్ధ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వద్దకు వెళ్లి ఆనంద్ స్పెక్ట్రమ్ హాస్పిటల్, డాక్టర్ ఆనంద్ వర్మ పై ఫిర్యాదు చేశాడు. డాక్టర్ లైసెన్స్ రద్దు చేసి, ఆస్పత్రికి సీల్ వేయాలని డిమాండ్ చేశాడు. నితిన్ భాటీ ఫిర్యాదుపై అధికారులు విచారణ ప్రారంభించారు. పోలీసులు ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని నితిన్ భాటీకి హామీ ఇచ్చారు.
Also Read: టాయిలెట్ లో ఎక్కువ సమయం గడిపితే ఆరోగ్యానికి ప్రమాదం.. హెచ్చరిస్తున్న వైద్యులు
ఇలాంటి ఘటనే మరొకటి జూనె నెలలో ఒడిశాలో జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లాకు చెందిన ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఒకే రోజు 13 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేశారు. అయితే ఆపరేషన్ తరువాత కళ్లకు ఉన్న కట్లు విప్పిన తరువాత వారికి తలనొప్పి, కళ్లలో మంట వంటి సమస్యలు వచ్చాయి. ఆ తరువాత 24 గంటల్లోపు మొత్తం 13 మంది కంటి చూపు కోల్పోయారు. దీంతో వారంతా తిరిగి ఆస్పత్రికి వెళ్లగా.. వారిని పరీక్షించిన వైద్యులు.. అందరికీ కంటి ఇన్‌ఫెక్షన్ అయిందని చెప్పి మరో రెండు రోజులు ఆస్పత్రిలోనే చికిత్స అందించారు. కానీ ఆ తరువాత కూడా వారి పరిస్థితి మెరుగుపడలేదు.
దీంతో వారికి చూపు తిరిగి వస్తుందన్న నమ్మకం తమకు లేదని వైద్యులు చెప్పగా.. అందరూ ఒడిశాలోని విమ్ సార్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వారిని పరీక్షించిన డాక్టర్ల కాటరాక్ట్ ఆపరేషన్ చేసిన వైద్యులు ఆపరేషన్ లో చేసిన తప్పు వల్లే ఇలా జరిగిందని తేల్చారు. దీంతో ఆ ప్రైవేట్ ఆస్పత్రి యజమాన్యంపై వైద్య నిర్లక్ష్యం కేసు నమోదు అయింది.