Kishan Reddy on KCR KTR: బీఆర్ఎస్ పాలనలో సాక్షాత్తు ప్రధాని హైదరాబాద్ వస్తే కనీసం బయటకు రాలేదు మీరు. కలెక్టర్ మీదనే దాడికి పాల్పడడం ముమ్మాటికీ తప్పే. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ తో కలిసి కాంగ్రెస్ కూడా వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, ఇది కరెక్ట్ కాదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తాజా రాజకీయ స్థితిగతులపై కిషన్ రెడ్డి సీరియస్ గా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందని, కాళేశ్వరంపై సీబీఐ విచారణకు తాము ఎప్పుడో డిమాండ్ చేశామన్నారు.
మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లు ఇచ్చే సర్టిఫికెట్ లు తమ పార్టీకి అవసరం లేదని, బీఆర్ఎస్ హయాంలో సాక్షాత్తు ప్రధానికి సరైన గౌరవం దక్కలేదన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు వస్తే కేసీఆర్, కేటీఆర్ లు బయటకు వచ్చి స్వాగతం పలికిన దాఖలాలు లేవన్నారు. అటువంటి నేపథ్యంలో వారికి బీజేపీ గురించి మాట్లాడే అర్హత కూడా లేదని కిషన్ రెడ్డి సీరియస్ గా వ్యాఖ్యానించారు.
ఇక వికారాబాద్ కలెక్టర్ పై దాడికి సంబంధించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్ మీద దాడికి పాల్పడడం ముమ్మాటికి తప్పేనన్నారు. కానీ గ్రామస్తులు మీద అక్రమ కేసులు పెట్టడం కూడా సరికాదని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోవాలన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన కాబట్టి, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తన ప్రజలతో మాట్లాడాలని కిషన్ రెడ్డి సూచించారు.
ఫార్ములా ఏ1 కారు రేస్ కు సంబంధించి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు ప్రభుత్వం, గవర్నర్ కు ఫైల్ పంపించిన నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందించారు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తప్పనిసరిగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. అంతలోనే తొందరపాటుగా కాంగ్రెస్ పార్టీ కామెంట్స్ చేయడం సరికాదని, అంత మాత్రాన బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనంటూ చెప్పడం అవివేకమన్నారు.
అవినీతికి పాల్పడిన ఎవరైనా ఎప్పటికీ తప్పించుకోలేరని, మహారాష్ట్ర, ఝార్ఖండ్ లలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని మంత్రి జోస్యం చెప్పారు. ఒక్క అవినీతి, కుంభకోణం ఆరోపణ లేకుండా బీజేపీ, శివసేన ప్రభుత్వ పాలన సాగిందని మళ్లీ ఈ రెండు రాష్ట్రాల ప్రజలు తమకే పట్టం కట్టనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.