Big Tv Originals: ప్రపంచ వ్యాప్తంగా భిన్న సంస్కృతి, సంప్రదాయాలతో పాటు విభిన్న భాషలు ఉన్నాయి. మొత్తంగా ఏడు ఖండాల్లో సుమారు 7 వేల భాషలు ఉన్నాయి. వాటిలో ప్రతి రెండు వారాలకు ఒక భాష అంతరించిపోతున్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదికలు వెల్లడిస్తున్నారు. 7 వేల భాషల్లో ఎక్కువగా లిపి లేని భాషలే ఉన్నాయి. వాటిలో ఓ కఠినమైన భాష గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రపంచంలో అత్యంత కఠినమైన లిపిలేని భాష ఇదే!
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లిపిలేని భాషలు ఉన్నప్పటికీ అత్యంత క్లిష్టమైన భాష హడ్జాభాష. ఈ భాష మాట్లాడే ప్రజలు ఉత్తర టాంజానియాలో ఎక్కువగా ఉంటారు. వీళ్లు గుంపులు గుంపులుగా జీవిస్తారు. హడ్జా భాష అనేది మరే ఇతర భాషతో సంబంధం లేని ఓ విభిన్న భాషగా గుర్తింపు తెచ్చుకుంది. హడ్జా అనేది పూర్తిగా మౌఖిక భాష. ఈ భాషను నేర్చుకోవడం, మాట్లాడ్డం అత్యంత కష్టమైన పని. హడ్జాబే ప్రజలు మాత్రమే ఈ భాష కచ్చితంగా మాట్లాడగలరు. ఇతరులు ఎవరూ ఈ భాషను నేర్చుకునే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆ భాష వినడానికే ఎంతో కఠినంగా అనిపిస్తుంది. అందుకే, ఈ భాష కొన్ని తెగలకు మాత్రమే పరిమితం అయ్యింది. అంతరించిపోయే ప్రమాదం ఉన్న భాషలలో ఐక్యరాజ్య సమితి ఈ భాషను చేర్చకపోవడం విశేషం. ఈ భాష ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి వాళ్ల పేర్లు ఉదాహరణ. కావాలంటే మీరే ఓసారి వినండి..
Hadzabe people have the most difficult names on Earth pic.twitter.com/ZcgPI1NIXz
— non aesthetic things (@PicturesFoIder) April 14, 2025
హడ్జాబే ప్రజల గురించి..
హడ్జాబే ప్రజలు ఉత్తర టాంజానియాలోని లేక్ ఇయాసి ప్రాంతంలో ఎక్కువగా నివాసం ఉంటారు. కొద్ది కొద్ది సమూహాలుగా నివసిస్తారు. వీళ్లంతా సంచార వేటగాళ్ళు. వారి సాంప్రదాయం వేట, తేనె సేకరించడం. తేనె, మాంసం అమ్మి వీళ్లు జీవనాన్ని కొనసాగిస్తారు. చిన్న పిల్లలు సైతం వేటలో ఆరితేరి ఉంటారు. అడవిలో వేట ద్వారా వాళ్లు ఆహారాన్ని సేకరిస్తారు. వారి జీవన శైలి పూర్తిగా ప్రకృతితో మమేకమై ఉంటుంది. హడ్జాబే ప్రజలు ఉత్తర టాంజానియాలోని లేక్ ఇయాసి ప్రాంతంతో పాటు రాతి కొండలు, శుష్క లోయలలో ఎక్కువగా నివాసం ఉంటారు.
ప్రకృతినే దేవతగా భావిస్తూ..
సాంప్రదాయ ఆయుధాలు, మతం, నమ్మకాలను కలిగి ఉంటారు. వారు ప్రకృతినే మతంగా, దేవతగా భావిస్తారు. అడవి తల్లి తమను కాపాడుతుందని భావిస్తారు. వాళ్లు కొలిచేది కూడా అడవితల్లినే కావడం విశేషం. ప్రతి ఏటా అడవిని మొక్కుతూ ఉత్సవాలు చేసుకుంటారు. వారి నమ్మకాలు అన్నీ ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. హడ్జాబే ప్రజలు పోడు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు. అటవీ భూములను సాగుకు అనుకూలంగా మార్చి పంటలు పండిస్తుంటారు. హడ్జాబే ప్రజలు ప్రస్తుతం ఏ ఇతర భాషతో సంబంధం లేని ఒక ప్రత్యేకమైన భాషను మాట్లాడతారు. ఈ భాష వాళ్లకంటూ ఓ ఐడెంటిటీని తీసుకొచ్చింది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA ద్వారా కంప్లైట్ ఫైల్ చేయబడుతుంది.