New Himalayan Snake Species: సుమారు నాలుగు ఏండ్ల క్రితం హిమాలయా పర్వతాల్లో గుర్తించిన అరుదైన పాముకు ప్రముఖ హాలీవుడ్ నటుడు, నిర్మాత లియోనార్డో డికాప్రియో పేరు పెట్టారు పరిశోధకులు. ఇకపై ఆ పామును ‘డికాప్రియో హిమాలయన్ పాము’గా పిలువనున్నట్లు వెల్లడించారు. కొత్త పాము జాతుల గుర్తింపు, పరిరక్షణకు లియోనార్డో చేస్తున్న కృషికి గౌరవంగా ఈ పాముకు ఆయన పేరు పెట్టినట్లు పరిశోధకుల బృందం ప్రకటించింది.
2020లో హిమాలయన్ పాము గుర్తింపు
2020 సంవత్సరంలో భారత్, జర్మనీ, యుకెకు చెందిన పరిశోధకుల బృందం మన దేశంలోని సరీసృపాలపై పరిశోధనలు నిర్వహించారు. ముఖ్యంగా హిమాలయా పర్వాతాలు విస్తరించి ఉన్న రాష్ట్రాల్లో ఈ పరిశోధన కొనసాగింది. ఇప్పటి వరకు తెలియని కొత్త జాతుల కోసం కొద్ది నెలల పాటు ఆయా రాష్ట్రాల్లో వెతికారు. ఈ పరిశోధనలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ హిమాలయా పర్వత ప్రాంతాలను సందర్శించారు. ఆ సమయంలో మట్టి రోడ్డు మీద గోధుమ రంగు పామును కనుగొన్నారు. కొంత మంది వ్యక్తులు ఆ పాముతో ఆడుకుంటూ కనిపించారు. ఆ పాము వారిని కాటు వేయకుండా కదలకుండా పడుకొని ఉండటాన్ని గుర్తించారు. దానికి అప్పట్లో దానికి హిమాలయన్ పాముగా పేరు పెట్టారు. ఈ పాముపై కొద్ది రోజుల పాటు పరిశోధనలు నిర్వహించారు. దాని డీఎన్ఏను విశ్లేషించారు. పరిశోధనల తర్వాత దాన్ని ‘అంగ్వికులస్’ జాతికి చెందిన పాముగా గుర్తించారు.
ఈ పరిశోధనలో పలు కొత్త పాములు గుర్తింపు
ఈ పరిశోధనలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా, కులు వంటి ప్రాంతాలతో పాటు, ఉత్తరాఖండ్ లోని నైనిటాల్, నేపాల్ లోని చిత్వాన్ నేషనల్ పార్క్ లో పలు కొత్త పాము జాతులను గుర్తించినట్లు మిజోరాం విశ్వవిద్యాలయంలోని బయాలజీ విభాగం ప్రొఫెసర్, పరిశోధన బృందం సభ్యుడు హెచ్‌టి లాల్రేంసంగా వెల్లడించారు. ఈ పరిశోధనలో చిన్న పరిమాణంలో ఉన్న పాములతో పాటు ముదురు గోధుమ రంగు మచ్చలతో ఉన్న పాములు, బలమైన పుర్రె కలిగిన పాములను గుర్తించినట్లు తెలిపారు. ఇవన్నీ సముద్ర మట్టానికి దాదాపు 6,000 అడుగుల ఎత్తులో నివసిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరిశోధన బృందంలో జీషన్ ఎ మీర్జా, వీరేందర్ కె భరద్వాజ్, సౌనక్ పాల్, గెర్నాట్ వోగెల్, పాట్రిక్ డి కాంప్‌బెల్, హర్షిల్ పటేల్ ఉన్నారు.
పాముల పరిరక్షణకు లియోనార్డో ఆర్ధికసాయం
అమెరికన్ నటుడు, నిర్మాత అయిన లియోనార్డో డికాప్రియోను పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. వాతావరణ మార్పులు, పెరిగిన జీవవైవిధ్య నష్టం, కాలుష్యం, మానవ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంలో చురుకుగా పాల్గొన్నారు. పలు దేశాల్లో పర్యటించి జీవ వైవిధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరిగే పరిశోధనలకు అండగా నిలుస్తున్నారు. పాములు, అరుదైన వన్యప్రాణులపై పరిశోధనలకు భారీ మొత్తంలో ఆర్థికసాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హిమాలయాల్లో కనుగొన్న పాముకు ‘డికాప్రియ హిమాలయన్ పాము’గా నామకరణం చేశారు పరిశోధకులు.
Read Also: పాముకు CPR చేయడం ఏంటి బ్రో? నిజంగా నువ్ గ్రేట్ అబ్బా!