జలుబు, దగ్గు త్వరగా రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలను ప్రతిరోజు తింటూ ఉండాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు బారిన పడకుండా కాపాడతాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి.
చికెన్ సూప్
చికెన్ సూప్ పేరు చెబితేనే నోరూరి పోతుంది. దీన్ని వేడి వేడిగా తింటే దీంట్లో ఉండే శోథ నిరోధక లక్షణాలు జలుబు, దగ్గును అడ్డుకుంటాయి. శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. ముక్కు దిబ్బడ కట్టకుండా అడ్డుకుంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థకు బలాన్ని ఇచ్చి పోషకాలను పెంచుతాయి. ముఖ్యంగా చల్లని వాతావరణంలో చికెన్ సూప్ తినడం చాలా అవసరం.
నిమ్మరసం, తేనే
ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే గొంతు నొప్పి, దగ్గు వంటివి త్వరగా తగ్గుతాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువ. ఇవి గొంతు దురద రాకుండా అడ్డుకుంటుంది. ఇక నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒక స్పూన్ లో సగం నిమ్మకాయ రసం పిండి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగేందుకు ప్రయత్నిస్తూ ఉండండి.
ఉప్పునీరు
ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో ఉప్పును వేసి పుక్కిలించడం ఎంతో మంచి పద్ధతి. ఇది గొంతు నొప్పి తగ్గించి దగ్గు రాకుండా అడ్డుకుంటుంది. గొంతులోని బ్యాక్టీరియాని చంపేందుకు కూడా ఈ నీళ్లు పనికొస్తాయి.
పసుపు
పసుపులో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. పసుపు పాలు తాగడం వల్ల దగ్గు, జలుబు వంటివి రాకుండా ఉంటాయి. ఒక కప్పు పాలలో పసుపు పొడిని వేసి, తేనెను వేసి బాగా కలుపుకోవాలి. పడుకునే ముందు ఈ పాలను వేడిగా తాగాలి. ఇది గొంతుకు ఉపశమనాన్ని ఇస్తుంది. నిద్ర కూడా బాగా పట్టేలా చేస్తుంది.
పుదీనా టీ
గొంతు నొప్పిని తగ్గించడంలో పుదీనా టీ ముందు ఉంటుంది. దీనికోసం తాజా పుదీనా ఆకులను తీసుకొని నీటిలో వేసి వేడి చేయండి. తర్వాత వడకట్టి ఆ నీటిని తాగేయండి. వేడిగా తాగితే గొంతుకు, జలుబుకు చాలా రిలీఫ్ గా ఉంటుంది. గొంతు దురద తగ్గుతుంది. నొప్పి కూడా రాదు. ముక్కు దిబ్బడా వంటి సమస్యలు ఉండవు. వీటిని చల్లని వాతావరణం లో ప్రతిరోజూ తాగుతూ ఉంటే మీకు ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది.